డిసెంబర్‌ 9న మ్యాప్‌మైఇండియా ఐపీవో 

MapMyIndia IPO To Open On December 9: Price Band Set At Rs 1 000 1 033 Per Share - Sakshi

ధర శ్రేణి రూ. 1,000–1,033 

రూ. 1,040 కోట్ల సమీకరణ 

న్యూఢిల్లీ: డిజిటల్‌ మ్యాపింగ్‌ సంస్థ మ్యాప్‌మైఇండియా ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 1,040 కోట్లు సమీకరించనుంది. ఐపీవో డిసెంబర్‌ 9న ప్రారంభమై 13న ముగియనుంది. దీని కోసం షేరు ధర శ్రేణి రూ. 1,000–1,033గా ఉండనుంది. కనీసం 14 షేర్ల కోసం బిడ్‌ చేయాల్సి ఉంటుంది. మ్యాప్‌మైఇండియా ఐపీవో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలోనే ఉంటుంది. ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు 1,00,63,945 షేర్లను విక్రయించనున్నారు.  

కంపెనీలో ప్రమోటర్లయిన రాకేశ్‌ కుమార్‌ వర్మకు 28.65 శాతం, రాశి వర్మకు 35.88 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్‌ఎస్‌ కింద రాశి వర్మ 42.51 లక్షల వరకూ, క్వాల్‌కామ్‌ ఏషియా పసిఫిక్‌ 27.01 లక్షలు, జెన్‌రిన్‌ కంపెనీ 13.7 లక్షల షేర్లు, ఇతర వాటాదారులు 17.41 లక్షల షేర్లను విక్రయించనున్నారు. సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌గా కూడా పేరొందిన మ్యాప్‌మైఇండియాలో అంతర్జాతీయ వైర్‌లెస్‌ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్, జపాన్‌ డిజిటల్‌ మ్యాపింగ్‌ కంపెనీ జెన్‌రిన్‌కు పెట్టుబడులు ఉన్నాయి.

న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ.. అధునాతన డిజిటల్‌ మ్యాప్‌లు, జియోస్పేషియల్‌ సాఫ్ట్‌వేర్, లొకేషన్‌ ఆధారిత ఐవోటీ టెక్నాలజీలను అందిస్తోంది. యాపిల్‌ మ్యాప్స్‌తో పాటు ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, హ్యుందాయ్‌ తదితర సంస్థలు కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top