Digital mapping
-
ఐపీఎల్ 2025... డిజిటల్ మార్కెటింగ్ బొనాంజా...!
వేసవి వచ్చిందంటే.. విద్యార్థులకు సెలవుల సరదా.. మామిడి పండ్ల మజా.. అంతేనా..? క్రేజీ క్రేజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి కూడా..! ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ హంగామాకు తెరలేవనుంది. ఈ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ‘జియో హాట్‌స్టార్’ చానల్ కూడా ఇందుకుతగ్గట్లే మార్కెటింగ్ వ్యూహాలతో సన్నద్ధమవుతోంది.రిలయన్స్‌కు చెందిన జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా ఏర్పడిన తర్వాత ఇదే తొలి ఐపీఎల్ సీజన్. దీంతో ప్రకటనల ద్వారా భారీ ఆదాయానికి గురిపెట్టింది. అందుకోసం డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్ వ్యూహాలను అమలు చేస్తుండడం తాజా పరిణామం. ఇప్పటికే గూగుల్, మెటా సంస్థలు ఈ పద్ధతి ద్వారా భారీగా ప్రకటనలు రాబడుతున్నాయి. ఇదే పద్ధతిలో.. జియో హాట్‌స్టార్ సైతం భారత్‌తో పాటు యావత్ ప్రపంచంలో క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించే ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయంపై కన్నేసింది. – సాక్షి, అమరావతిమార్చి 22 నుంచి మే 25 వరకు దేశంలోని 13 నగరాల్లో నిర్వహించే 74 మ్యాచ్‌లకు భారీగా వీక్షకులను ఆకర్షించడం ద్వారా జియో హాట్‌స్టార్ రికార్డు స్థాయిలో ప్రకటనల ఆదాయంపై గురిపెట్టింది. ఐపీఎల్–2025 భారీ మార్కెటింగ్ ఆదాయ వనరుగా మారనుంది. టీవీలు, డిజిటల్ మీడియా ప్రసారాలు, టీమ్ స్పాన్సర్‌షిప్‌లు, స్టేడియంలలో ప్రకటనలు, ఇతరత్రా మాధ్యమాల ద్వారా దాదాపు రూ.7 వేల కోట్లు వస్తాయని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసార హక్కులు పొందిన జియో హాట్‌స్టార్ అందులో రూ.4,500 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డుస్థాయిలో వ్యూయర్షిప్ సాధించడం ద్వారా తమ చానల్లో ప్రకటనలు ఇస్తే వినియోగదారులకు మరింత చేరువ కాగలమని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నమ్మకం కలిగించాలన్నది ఉద్దేశం. అందుకోసం జియో హాట్‌స్టార్ అడ్వర్టైజ్మెంట్ విభాగం ఇటీవల బెంగళూరులో పారిశ్రామిక, వ్యాపార సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సెమినార్ నిర్వహించింది. కార్పొరేట్ పరిశ్రమలు, భారీ వ్యాపార సంస్థల నుంచే కాదు.. రాష్ట్రం/నగరాలకు పరిమితమైన వ్యాపార సంస్థల నుంచి ప్రకటనలు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 17 వేల అమెరికన్ డాలర్లు (రూ.14.80లక్షలు)తో ప్రకటనల ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా ఏ వీక్షకుడి మొబైల్ ఫోన్లలో ఎటువంటి ప్రకటనలు ఇవ్వాలన్నది ముందుగానే గుర్తిస్తామని వారికి వివరించింది.భారీ వ్యూయర్‌షిప్పే లక్ష్యం!ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్‌లు ఉన్నప్పటికీ ఐపీఎల్ లెవలే వేరు. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) 2008లో ప్రారంభించిన ఐపీఎల్‌కు ఏటా ఆదరణ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అటు స్టేడియాలు, ఇటు టీవీలు, స్మార్ట్ఫోన్లలో భారీ వ్యూయర్షిప్ ఐపీఎల్ సొంతం. ఈసారి దీనిని మరింతగా పెంచుకోవాలని జియోహాట్‌స్టార్ భావిస్తోంది. ఒక్కో మ్యాచ్‌ను కనీసం 4 కోట్ల టీవీలు, 42 కోట్ల మొబైల్ ఫోన్లలో వీక్షించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ ప్యాకేజీల కింద చానల్ ప్రసారాలను అందుబాటులోకి తెచ్చింది.డిజిటల్ మ్యాపింగ్ అంటే..వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ పిల్లలను ఇంటర్మీడియట్ తరువాత ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చించాలనే విషయంపై వాట్సాప్‌లో చాటింగ్ చేశారు. అంతే..! కాసేపటికే వారి ఫేస్బుక్ వాల్‌పై దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల ప్రకటనలు వరదలా పారాయి. స్మార్ట్ ఫోన్‌పై ఫేస్బుక్ ఖాతాను స్క్రోల్ చేసినా ఇంజినీరింగ్ కాలేజీల ప్రకటనలే. ఇది ఎలా సాధ్యం?ఆ వ్యక్తులు ఇంజనీరింగ్ కాలేజీలపై వాకబు చేయనున్నారని ఫేస్బుక్ యాజమాన్య సంస్థ ‘మెటా’కు ఎలా తెలిసింది!? ఈ ప్రశ్నకు సమాధానం.. ‘డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్’. దీనిని సర్వైలెన్స్ క్యాపిటలిజం (నిఘా పెట్టుబడిదారీ విధానం)గా చెబుతారు. డిజిటల్ టెక్నాలజీ యుగంలో పారిశ్రామిక, వ్యాపార సంస్థల మార్కెటింగ్ ప్రణాళికల్లో సర్వైలెన్స్ క్యాపిటలిజం అత్యంత కీలకంగా మారింది.డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్‌ను సొమ్ము చేసుకుంటున్న సంస్థలుగూగుల్, మెటా, అమెజాన్ వంటివి తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, వారి అభిరుచులు, వారి వ్యవహార శైలి మొదలైన డేటాను ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తాయి. ఇదే ‘డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్’. ఈ డేటాను కొనుగోలు చేసేందుకు గూగుల్, మెటాలతో పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ సంస్థలకు అందిన డేటా ఆధారంగా.. ఖాతాదారుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా వ్యాపార ప్రకటనలు వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రసారమవుతాయి. ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోతాయి. అంటే సోషల్ మీడియా ఖాతాదారులు తమ ఫోన్లలో చేసే ప్రతి సెర్చ్, ప్రతి క్లిక్ కూడా డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్‌కు దోహదపడుతోంది. తద్వారా సర్వైలెన్స్ క్యాపిటలిజం మార్కెటింగ్ ప్రణాళికలు రూపొందించేందుకు ఉపకరిస్తోంది. ఇప్పటివరకు గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలే డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్‌ను సొమ్ము చేసుకుంటున్నాయి. మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లి భారీగా ప్రకటనల ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా ఇకపై జియో హాట్‌స్టార్ కూడా ఈ పద్దతిని అనుసరించనుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే అభిమానుల అభిరుచులను దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, నగరాల వారీగా విభజించి విశ్లేషించి అందుబాటులోకి తేనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా, భారత దేశం అంతటా, రాష్ట్రాలు, నగరాల వారీగా ఎక్కడికక్కడ వివిధ ప్యాకేజీల కింద ప్రకటనలను రాబట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. -
డిసెంబర్ 9న మ్యాప్‌మైఇండియా ఐపీవో
న్యూఢిల్లీ: డిజిటల్ మ్యాపింగ్ సంస్థ మ్యాప్‌మైఇండియా ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,040 కోట్లు సమీకరించనుంది. ఐపీవో డిసెంబర్ 9న ప్రారంభమై 13న ముగియనుంది. దీని కోసం షేరు ధర శ్రేణి రూ. 1,000–1,033గా ఉండనుంది. కనీసం 14 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాప్‌మైఇండియా ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలోనే ఉంటుంది. ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు 1,00,63,945 షేర్లను విక్రయించనున్నారు. కంపెనీలో ప్రమోటర్లయిన రాకేశ్ కుమార్ వర్మకు 28.65 శాతం, రాశి వర్మకు 35.88 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్ఎస్ కింద రాశి వర్మ 42.51 లక్షల వరకూ, క్వాల్కామ్ ఏషియా పసిఫిక్ 27.01 లక్షలు, జెన్రిన్ కంపెనీ 13.7 లక్షల షేర్లు, ఇతర వాటాదారులు 17.41 లక్షల షేర్లను విక్రయించనున్నారు. సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌గా కూడా పేరొందిన మ్యాప్‌మైఇండియాలో అంతర్జాతీయ వైర్లెస్ టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్, జపాన్ డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ జెన్రిన్కు పెట్టుబడులు ఉన్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ.. అధునాతన డిజిటల్ మ్యాప్‌లు, జియోస్పేషియల్ సాఫ్ట్వేర్, లొకేషన్ ఆధారిత ఐవోటీ టెక్నాలజీలను అందిస్తోంది. యాపిల్ మ్యాప్స్‌తో పాటు ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, హ్యుందాయ్ తదితర సంస్థలు కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. -
ఎలక్షన్‌పై డిజిటల్ ఐ!
* ‘హైదరాబాద్ కాప్’లో ఎలక్షన్ ఫీచర్స్ * పోలింగ్ బూత్‌లన్నీ డిజిటల్ మ్యాపింగ్ * జియోట్యాగింగ్ ద్వారా అనుసంధానం * ‘లీవ్ బజ్’ పేరుతో * అత్యవసర స్పందన బటన్ సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం ఏడాదిన్నర కాలంగా అందుబాటులోకి తీసుకువచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రేటర్ ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా పూర్తి చేయడానికీ వినియోగించనుంది. దీనికి సంబంధించి అధ్యయనం, అభివృద్ధి బాధ్యతల్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) టీమ్ చేపడుతోంది. ప్రాథమికంగా ‘హైదరాబాద్ కాప్’ యాప్‌లో ఎలక్షన్ ఏర్పాట్లకు ప్రత్యేకమైన మార్పు చేర్పు లు చేస్తూ ప్రయోగాత్మకంగా వినియోగించడం ప్రారంభించారు. రానున్న రోజుల్లో అవసరాలకు తగ్గట్టు యాప్స్‌లో మార్పుచేర్పులకు కసరత్తు జరుగుతోంది. కేంద్రాలన్నీ డిజిటల్ మ్యాపింగ్... నగరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలన్నింటినీ డిజిటల్ మ్యాపింగ్ ద్వారా యాప్‌లో పొందుపరిచారు. దీన్ని ఓపెన్ చేసుకుంటే కేవలం పోలింగ్ కేంద్రంతో పాటు అక్కడ విధుల్లో ఉండే సిబ్బంది ఎంతమంది? ఎక్కడెక్కడ విధులు కేటాయించారు? తదితర అంశాలు ప్రత్యక్షమవుతాయి. వారిని సంప్రదించాలని భావించిన అధికారులు, ఇతర సిబ్బందికి ప్రత్యామ్నాయం అవసరం లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. మ్యాప్‌లో కనిపించిన సిబ్బంది గుర్తుపై నొక్కితే చాలు... ప్రత్యేక పాప్అప్ రూపంలో అతడి పేరు, హోదా, ఫోన్‌నెంబర్లు ప్రత్యక్షం కానున్నాయి. కనిపించిన నెంబర్‌ను టచ్ చేయడం ద్వారా ఫోన్ చేసి మాట్లాడే విధంగా డిజైన్ చేశారు. జవాబుదారీ తనం కోసం ట్యాగింగ్... పోలింగ్ కేంద్రాల వద్ద విధులకు కేటాయిస్తున్న సిబ్బందిలో పూర్తి జవాబుదారీతనం ఉండేలా ఈ యాప్ ద్వారా చర్యలు తీసుకున్నారు. ఓ అధికారికి ఎక్కడైనా విధులు కేటాయిస్తే తక్షణం ఆ వివరాలను ఈ యాప్‌లో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఫీడ్ చేస్తారు. సదరు అధికారి ఆ ప్రాంతానికి వెళ్తేనే యాప్‌లోకి ప్రవేశించి, ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అనధికారికంగా మరో ప్రాంతంలో ఉండి, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించినా ఈ యాప్ అంగీకరించదు. ఫలితంగా విధినిర్వహణ పక్కాగా జరగటంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని అధికారులూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్... పోలింగ్ జరిగే సమయంలో కొందరు వ్యక్తులు, రాజకీయ నేతలు పుట్టించే పుకార్లు అధికారులకు కంగారు పుట్టించడంతో పాటు సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టిస్తాయి. అలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ యాప్‌లో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ పొందే సౌకర్యం కల్పించారు. ఓ ప్రాంతంలో విధుల్లో ఉన్న సిబ్బంది, అధికారులు నిర్ణీత సమయంలో ఈ యాప్‌లోకి ప్రవేశించి, అక్కడి పరిస్థితుల్ని వివరిస్తూ వివరాలు పొందుపరుస్తుంటారు. పుకార్లు షికారు చేసిన సందర్భంలో ఉన్నతాధికారులు, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ఈ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ను పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటారు. అన్నింటిలోనూ వినియోగించేలా... ఈ యాప్ అన్ని స్థాయిల్లోనూ సిబ్బందికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు కంప్యూటర్, ల్యాప్‌టాప్స్‌తో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద ఉంటే ట్యాబ్స్, స్మార్ట్ఫోన్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో సాధారణ పోలీసింగ్‌లోనూ ‘హైదరాబాద్ కాప్’లో ఉండే సదుపాయాలు ఉపయుక్తంగా మారనున్నాయని అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైతే ‘మీట’చాలు ఎన్నికలు జరిగే సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో హఠాత్తుగా ఉద్రిక్తతలు, ఘర్షణలు చెలరేగుతుంటాయి. వీటిని ప్రత్యక్షంగా చూస్తున్న, సమాచారం తెలుసుకుని అక్కడకు చేరిన క్షేత్రస్థాయి సిబ్బంది దాన్ని అధికారులు, ఇతర విభాగాలకు పంచుకోవడానికి, అదనపు బలగాలను అక్కడకు రప్పించడానికి అష్టకష్టాలు పడాల్సివచ్చేది. విలువైన సమయాన్ని సమాచార మార్పిడికే కేటాయించడం తప్పనిసరిగా మారేది. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యాప్‌లో ‘లీవ్ బజ్’ పేరుతో ప్రత్యేక బటన్ ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతంలోని సిబ్బంది దీన్ని నొక్కితే చాలు.. ఉన్నతాధికారుతో పాటు సమీపంలో ఉన్న ఇతర సిబ్బందికీ ఆ సమాచారం రూట్ మ్యాప్‌తో సహా చేరిపోతుంది.