రూ.3 లక్షలకి ఆర్డర్‌ పెడితే.. వాషింగ్‌ పౌడర్‌ వచ్చింది! | Man Orders Rs 2 9 Lakh Graphics Card Receives Detergent Powder | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షలకి ఆర్డర్‌ పెడితే.. వాషింగ్‌ పౌడర్‌ వచ్చింది!

Mar 24 2026 7:48 PM | Updated on Mar 24 2026 8:28 PM

Man Orders Rs 2 9 Lakh Graphics Card Receives Detergent Powder

ఆన్‌లైన్ షాపింగ్‌లో లెక్కకు మించిన మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటిదే ఇప్పుడు మరోమారు తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్వగత్ నాయక్ అనే వ్యక్తి తన స్టార్టప్ కోసం సుమారు రూ. 2.9 లక్షల విలువ గల హైఎండ్ గ్రాఫిక్స్ కార్డ్ ఆర్డర్ చేశారు. కానీ డెలివరీ వచ్చిన తర్వాత అతను ప్యాకెట్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో గ్రాఫిక్స్ కార్డ్ బదులుగా 1 కేజీ డిటర్జెంట్ పౌడర్ ఉండటం చూసి షాకయ్యారు.

'ఫుల్‌ఫిల్డ్ బై అమెజాన్' (FBA) పద్ధతిలో డెలివరీ జరిగింది. అంటే దీనిని అమెజాన్ గోదాములో నిల్వ చేసి నేరుగా అక్కడి నుంచే రవాణా చేశారని స్వగత్ వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి ఆర్డర్లకు ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఎందుకంటే కంపెనీ స్వయంగా స్టోర్ చేసి ఆర్డర్ చేసుకున్నవారికి డెలివరీ చేస్తుంది.

డెలివరీ ప్యాకేజింగ్‌పై అనుమానాస్పద లక్షణాలు కనిపించినట్లు స్వగత్ పేర్కొన్నారు. తయారీదారు పెట్టిన అసలు సీల్ కోసి మళ్లీ టేప్ చేశారు, అలాగే నకిలీ బార్‌కోడ్ కూడా అతికించారని అన్నారు. అదే విధంగా, ప్యాకెట్‌పై ఉన్న షిప్పింగ్ లేబుల్‌లో బరువు 1.56 కేజీలుగా చూపించారు. కానీ ఒక అసలు RTX 5090 గ్రాఫిక్స్ కార్డ్ ప్యాకేజింగ్‌తో కలిపి సుమారు 3 కిలోల వరకు ఉంటుంది.

ఇవన్నీ గమనించిన స్వగత్ నాయక్, ఇది స్పష్టంగా మోసం అని పేర్కొన్నాడు. అతను తన అన్‌బాక్సింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను అమెజాన్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించినప్పటికీ, కేవలం 15 నిమిషాల్లోనే అతని కంప్లైంట్‌ను మూసివేశారు. ప్రస్తుతం కంపెనీ రీఫండ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఇది వినియోగదారుల హక్కులు, ఆన్‌లైన్ షాపింగ్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆన్‌లైన్ రిటైలర్లతో తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలనే పంచుకోగా, మరికొందరు నాయక్ వాదనలను ప్రశ్నిస్తూ, ఆ అన్‌బాక్సింగ్ వీడియోను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement