
మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్ఎంఎంఎల్) ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల (ఈవీ) తయారీదారుగా తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది. ఎల్ 5 కేటగిరీలో కంపెనీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు రెండు లక్షల కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు చెప్పింది.
ఈ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని 2024 ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం నుంచి 24.2 శాతానికి పెంచినట్లు పేర్కొంది. సుస్థిర మొబిలిటీ, సృజనాత్మక ఉత్పత్తుల తయారీకి కంపెనీ కట్టుబడి ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా లక్షకుపైగా ట్రియో మోడల్ ఎలక్ట్రిక్ ఆటోలను విక్రయించి ఈ విభాగంలో మొదటిస్థానంలో నిలిచామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
త్రివీలర్ కమర్షియల్ వాహనాలకు సంబంధించి ఎల్ 5 కేటగిరీలో ఎంఎల్ఎంఎంఎల్ ముందంజలో ఉందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ట్రియో, జోర్ గ్రాండ్ వంటి ఉత్పత్తులు ఈ వృద్ధికి కీలకంగా నిలిచాయని తెలిపింది. ట్రియో 1,00,000 యూనిట్లకు పైగా విక్రయించడంతో ఈ వాహనాలకు వినియోగదారుల్లో విశ్వసనీయత నెలకొందని చెప్పింది. ఎల్5 ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీలో 37.3 శాతం మార్కెట్ వాటాతో ఎంఎల్ఎంఎంఎల్ ఆధిపత్యం వహిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీన్ని కొనసాగించడానికి, వివిధ వ్యాపార అవసరాలను తీర్చడానికి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలైన మెటల్ బాడీ ట్రియో, మహీంద్రా జీఈఓ మోడళ్ల విక్రయాలు ఎంతో తోడ్పడుతున్నాయని పేర్కొన్నాయి.