
ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ జూన్‌లో రూ.5,313 కోట్లు ప్రీమియం ఆదాయాన్ని సమకూర్చుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.60 శాతం పెరిగింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థలతో పోల్చి చూసినా 12 శాతం పెరిగినట్టు ఎల్‌ఐసీ ప్రకటించింది. జూన్‌లో 25 ప్రైవేటు జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా వసూలు చేసిన ఇండివిడ్యువల్ పాలసీల ప్రీమియం ఆదాయం రూ.8,408 కోట్లుగా ఉంది.
ఈ ఏడాది జూన్‌లో ఎల్‌ఐసీ 12.49 లక్షల కొత్త పాలసీలను జారీ చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇలా జారీ చేసిన కొత్త పాలసీలు 14.65 లక్షలుగా ఉండడం గమనార్హం. ఇందులో వ్యక్తులకు సంబంధించిన పాలసీలు 12.48 లక్షలగా ఉంటే, గ్రూప్ పాలసీలు 1,290గా ఉన్నాయి. ఎల్‌ఐసీకి గ్రూప్ పాలసీల ప్రీమియం ఆదాయం జూన్ నెలలో రూ.22,087 కోట్లుగా ఉంది.
గతేడాది జూన్ కంటే 7 శాతం తక్కువ. ప్రైవేటు జీవిత బీమా కంపెనీల గ్రూప్ ప్రీమియం ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి రూ.5,315 కోట్లుగా ఉంది. ఎల్‌ఐసీ మొత్తం ప్రీమియం (ఇండివిడ్యువల్, గ్రూప్ కలసి) ఆదాయం జూన్ నెలలో 3.43 శాతం తక్కువగా రూ.27,395 కోట్లుగా నమోదైంది. ప్రైవేటు కంపెనీల మొత్తం ప్రీమియం ఆదాయం సైతం 2.45 శాతం తగ్గి రూ.13,722 కోట్లకు పరిమితమైంది.