1,100 ఇంజనీర్లకు ఎల్‌అండ్‌టీ చాన్స్‌

L And T Plans to Recruit 1100 Engineers in 2021 - Sakshi

న్యూఢిల్లీ: నిర్మాణ, ఇంజనీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ 2021లో సుమారు 1,100 మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకునే ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో కొనసాగుతున్న నియామకాల్లో భాగంగా.. ప్రతిష్టాత్మక ఐఐటీ సంస్థలకు చెందిన 250 మంది విద్యార్థులకు ఆఫర్లను అందించినట్టు చెప్పారు. ఏటా తాము 1,100 మందికిపైగా ఇంజనీర్లను నియమించుకుంటామని చెబుతూ.. అందులో 90 శాతం మంది ఐఐటీలు, ఎన్‌ఐటీల వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన వారే ఉంటారని స్పష్టం చేశారు.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ పెట్టుబడులపై ఎల్‌అండ్‌టీ ఎంఎఫ్‌ ప్రచారం
ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ‘లేట్‌ లతీఫ్‌ 2021’ పేరుతో ఒక డిజిటల్‌ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లో ముందు నుంచే పెట్టుబడులు పెట్టడానికి ఉన్న ప్రాధాన్యం గురించి ఇన్వెస్టర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించనున్నట్టు తెలిపింది. లక్ష్యానికి ఎంత మేర పెట్టుబడులు పెట్టాలి తెలియజేసే కాలిక్యులేటర్‌ తదితర సమాచారాన్ని  www.ltfs.com/companies/lnt-investment-management/elss.html పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ ప్రకటించింది.

ఈవైలో కొత్తగా 9,000 మంది నిపుణులకు చోటు
2021లో నియమించుకోనున్నట్టు సంస్థ ప్రకటన

ముంబై: ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సర్వీసెస్‌ (ఈవై) 2021లో వివిధ టెక్నాలజీ విభాగాల్లో 9,000 మంది నిపుణులను భారత్‌లో నియమించుకోనున్నట్టు ప్రకటించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌) కోర్సులు చదివిన వారు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, అనలైటిక్స్, ఇతర ఆధునిక టెక్నాలజీలకు సంబంధించి ఈ నియామకాలు ఉంటాయని ఈవై తెలిపింది. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మా క్లయింట్లు టెక్నాలజీ ఆధారిత పరివర్తనం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణంలో వారికి మేము మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా మా సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాము. కనుక రానున్న సంవత్సరంలో నియామకాలను గణనీయంగా పెంచబోతున్నాము’’ అంటూ ఈవై ఇండియా పార్ట్‌నర్‌ రోహన్‌ సచ్‌దేవ్‌ తెలిపారు. ప్రస్తుతం ఈవై ఇండియా పరిధిలో 50,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 36 శాతం స్టెమ్‌ విభాగానికి చెందిన వారే ఉన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top