ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, మైండ్‌ట్రీ విలీనం!

L and T Infotech and Mindtree Going To be merge Said By Bloomberg - Sakshi

22 బిలియన్‌ డాలర్ల కంపెనీగా ఆవిర్భావం

షేర్ల మార్పిడిపై ఎల్‌అండ్‌టీ సమాలోచన

త్వరలో రెండు కంపెనీల బోర్డుల నిర్ణయం?

నేడు ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ క్యూ4 ఫలితాలు

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీలు ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్‌ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. మౌలిక రంగ ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ గ్రూప్‌నకు చెందిన ఈ రెండు సంస్థలు విలీనమైతే 22 బిలియన్‌ డాలర్ల(రూ. 1,65,000 కోట్లు) విలువైన ఐటీ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు అంచనా. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్‌ బోర్డులు విలీనానికి అనుగుణంగా షేర్ల మార్పిడి అంశాన్ని పరిశీలించనున్నట్లు   మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా మాతృ సంస్థ లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) లిస్టెడ్‌ ఐటీ కంపెనీలు రెండింటి విలీనానికున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేసినట్లు వెల్లడించాయి. తద్వారా గ్లోబల్‌ డిజిటల్‌ దిగ్గజాలతో విలీన సంస్థ పోటీపడేందుకు వీలుంటుందని మౌలిక రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ భావిస్తున్నట్లు తెలియజేశాయి.  

వచ్చే వారమే?
మౌలిక దిగ్గజం ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌ నియంత్రణలోని ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్‌ విలీనానికి షేర్ల మార్పిడి అంశంపై వచ్చే వారం మొదట్లోనే బోర్డులు చర్చించే వీలున్నట్లు తెలుస్తోంది. ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీను 2019లో ఎల్‌అండ్‌టీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీకి 61 శాతం వాటా ఉంది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) తాజాగా రూ. 65,287 కోట్లు (8.7 బిలియన్‌ డాలర్లు)స్థాయికి చేరింది. ఇక ఎల్‌అండ్‌టీకి 74 శాతం వాటా కలిగిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ విలువ రూ. 1,02,825 కోట్లు(13.7 బిలియన్‌ డాలర్లు)గా నమోదైంది. వెరసి విలీన సంస్థ మార్కెట్‌ క్యాప్‌ 22 బిలియన్‌ డాలర్లను అధిగమించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.  

క్లయింట్ల విషయంలో..
ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనమైతే క్లయింట్లు లేదా బిజినెస్‌లో పరస్పర అతిక్రమణ నామమాత్రంగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వీసులకు అధిక ధరలు పొందేందుకు, వ్యయాల నియంత్రణకు రెండు సంస్థల మధ్య ఒప్పందం దారి చూపుతుందని అంచనా వేశాయి. అయితే విలీనం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే వీలున్నట్లే.. ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నదని మీడియా వర్గాలు  అభిప్రాయపడ్డాయి. కాగా.. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎల్‌అండ్‌టీ ప్రతినిధి ఒకరు నిరాకరించగా.. మైండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ నుంచి స్పందన కరువైనట్లు తెలియజేశాయి. మైండ్‌ట్రీ క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాలను సోమవారం(18న) విడుదల చేయగా.. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌పనితీరు నేడు(19న) వెల్లడికానుంది.

కోవిడ్‌–19 ఎఫెక్ట్‌
కొద్ది నెలలుగా ప్రపంచస్థాయిలో విస్తరించిన కోవిడ్‌–19 మహమ్మారితో డిజిటైజేషన్‌కు డిమాండు బాగా పెరిగినట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీలకు బిజినెస్‌ అవకాశాలు భారీగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ ఔట్‌సోర్సింగ్‌ దిగ్గజాలు సైబర్‌ సెక్యూరిటీ, ఆటోమేషన్, మెషీన్‌లెర్నింగ్‌ సపోర్ట్‌ తదితర నవతరం సేవలు అందించేందుకు పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సేవలకు పెరుగుతున్న డిమాండును అందుకునేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి.  
షేర్లు డీలా: మైండ్‌ట్రీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 3,965 వద్ద నిలవగా.. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ 2.5 శాతం నష్టంతో రూ. 5,890 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో మైండ్‌ట్రీ రూ. 4,020–3,834 మధ్య ఊగిసలాడింది.

మైండ్‌ట్రీ లాభం జూమ్‌
న్యూఢిల్లీ: ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 49% జంప్‌చేసి రూ. 473 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో రూ. 317 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 37 శాతంపైగా ఎగసి రూ. 2,897 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,109 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. ఇక పూర్తి ఏడాదికి మైండ్‌ట్రీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 49% వృద్ధితో రూ. 1,653 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 7,968 కోట్ల నుంచి రూ. 10,525 కోట్లకు ఎగసింది. ఇది 31% అధికం.  షేరుకి రూ. 27 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది.  కాగా, మెండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టీ టెక్‌ మధ్య విలీన వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ ఊహాగానాలేనంటూ  మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ దేవశిష్‌ చటర్జీ  దేవశిష్‌ కొట్టిపారేశారు.

చదవండి: 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top