క్యూ2 నుంచి ఐటీకి జోష్‌

IT Shares Gain Post Accenture Q2 Results - Sakshi

పరిశ్రమ వర్గాల అంచనాలు

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో అంతంతమాత్ర ఫలితాలు సాధించినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది(2023–24) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లోనూ ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు తెలియజేశాయి. అయితే రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్‌) నుంచి తిరిగి ఐటీ సేవలకు డిమాండ్‌ పుంజుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి.

గతేడాది క్యూ4లో ఐటీ దిగ్గజాలు అంచనాలకు దిగువన ఫలితాలు ప్రకటించాయి. మందగమన పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా యాజమాన్యం అప్రమత్తంగా స్పందించాయి. భవిష్యత్‌ ఆర్జనపట్ల ఆచితూచి అంచనాలు వెల్లడించాయి. యూఎస్‌ నుంచి బీఎఫ్‌ఎస్‌ఐ, టెక్నాలజీ సర్వీసులు, తదితర కొన్ని విభాగాలలో కస్టమర్లు డీల్స్‌ విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రాజెక్టుల ఆలస్యం
అనుకోనివిధంగా కొన్ని ప్రాజెక్టులు తగ్గిపోవడం, కాంట్రాక్టులు కుదుర్చుకోవడంలో క్లయింట్ల వెనకడుగుపట్ల ఇన్ఫోసిస్, టీసీఎస్‌ యాజమాన్యాలు క్యూ4 ఫలితాల విడుదల సందర్భంగా స్పందించిన సంగతి తెలిసిందే. గత క్యూ4 ప్రభావం ఈ ఏడాది క్యూ1పై కనిపించవచ్చని ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది క్యూ3 నుంచి పరిస్థితులు సర్దుకుంటాయని అంచనా వేశారు. రెండు, మూడు త్రైమాసికాలు మందగించినప్పటికీ అక్టోబర్, నవంబర్‌కల్లా యూఎస్‌లో తిరిగి వృద్ధి ఊపందుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశీ ఐటీ పరిశ్రమ 200 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వెరసి దేశీ ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, ప్రభావం చూప గలదని వివరించారు. కొన్ని త్రైమాసికాలపాటు ఐటీ దిగ్గజాల ఫలితాలు మందగించవచ్చని ఐసీఆర్‌ఐఈఆర్‌ చైర్‌పర్శన్, జెన్‌ప్యాక్ట్‌ వ్యవస్థాపకులు ప్రమోద్‌ భాసిన్‌ పేర్కొన్నారు. ఆపై తిరిగి వృద్ధి బాట పట్టే వీలున్నట్లు తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top