ఐటీ.. వృద్ధి మందగమనం!

Indian tech sector growth slows in FY23 - Sakshi

2022–23లో వృద్ధి 8.4 శాతమే

245 బిలియన్‌ డాలర్లకు పరిమితం

నాస్కామ్‌ అంచనా

న్యూఢిల్లీ: దేశీ ఐటీ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మందగించనుంది. 8.4 శాతానికి పరిమితమై 245 బిలియన్‌ డాలర్ల స్థాయిలో నమోదు కానుంది. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. గత ఆర్థిక సంవత్సరంలో టెక్‌ పరిశ్రమ 15.5 శాతం పెరిగి 226 బిలియన్‌ డాలర్లకు చేరింది. దశాబ్దకాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. కోవిడ్‌ మహమ్మారిపరమైన మార్పులతో కంపెనీలు టెక్నాలజీపై మరింతగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడింది.

అయితే, తాజాగా రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు భౌగోళికరాజకీయ సవాళ్లు విసురుతుండటం, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుండటం, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండటం తదితర అంశాలు టెక్నాలజీ పరిశ్రమకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాస్కామ్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సీఈవోలు భవిష్యత్‌పై ’జాగరూకతతో కూడిన ఆశావహ’ అభిప్రాయం వ్యక్తం చేశారు.  

నిర్ణయాల్లో జాప్యం..
భౌగోళికరాజకీయ ఆందోళనల వల్ల ఐటీ కాంట్రాక్టులు ఇవ్వడంపై కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, కొన్ని మార్కెట్లలో డిమాండ్‌ కూడా తగ్గుతోందని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ తెలిపారు. కొన్ని కంపెనీలకు మాత్రమే పటిష్టమైన ఆర్డర్లు ఉన్నాయని, పరిశ్రమకు ఇదే కాస్త ఊతంగా ఉంటోందని ఆమె వివరించారు. టాప్‌ 5 కంపెనీల ఆర్డర్‌ బుక్‌ 18 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండటం, నిర్దిష్ట కంపెనీల క్లయింట్ల సంఖ్య 10 శాతం మేర పెరగడం, సామరŠాధ్యల వినియోగం 6–7 శాతం పెంచుకోగలగడం వంటి సానుకూల అంశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఉద్యోగార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాల కొరత ఉంటోందని ఘోష్‌ చెప్పారు. మన విద్యావ్యవస్థలోనే దీనికి మూలం ఉందని, ఫలితంగా సరైన నైపుణ్యాలున్న తాజా గ్రాడ్యుయేట్లు పరిశ్రమకు లభించడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణనిచ్చేందుకు కంపెనీలు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఘోష్‌ వివరించారు. చాట్‌జీపీటీ లాంటి జనరేటివ్‌ కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్‌ఫాంల ప్రభావం ఉద్యోగాలపై పరిమితంగానే ఉంటుందని, వాస్తవానికి ఏఐతో ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆమె చెప్పారు.  

54 లక్షలకు ఐటీ సిబ్బంది.. : మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీలో ఉద్యోగుల సంఖ్య 2.90 లక్షలు పెరిగి మొత్తం 54 లక్షలకు చేరనుంది. వీరిలో 20 లక్షల మంది మహిళలు ఉండగా, 36 శాతం మందికి డిజిటల్‌ నైపుణ్యాలు ఉన్నట్లు నాస్కామ్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (4.5 లక్షల వృద్ధి) తక్కువే అయినప్పటికీ కోవిడ్‌ పూర్వ స్థాయితో పోలిస్తే ఇది ఎక్కువేనని పేర్కొంది.

గత రెండు ఆర్థిక సంవత్సరాలు అసాధారణమైనవని వివరించింది. ఐటీ కంపెనీలకు ఇటీవల సమస్యగా మారిన అట్రిషన్‌ (ఉద్యోగుల వలసలు) రేటు జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే (25.7 శాతం) డిసెంబర్‌ త్రైమాసికంలో కాస్త నెమ్మదించి 21.8 శాతానికి చేరింది. ఇక భారత ఐటీ ఎగుమతులు 9.4 శాతం పెరిగి 194 బిలియన్‌ డాలర్లకు చేరగలవని నాస్కామ్‌ పేర్కొంది. 2030 నాటికి దేశీ ఐటీ రంగం 500 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top