చరిత్రాత్మక కనిష్ట పతన దిశగా రూపాయి విలువ! కారణాలివే..

Indian Rupee Record Down Fall Against US Dollar   - Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట పతనం దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ బుధవారం 44 పైసలు పతనమై, 76.32 వద్ద ముగిసింది. గడచిన 20 నెలల్లో (2020 ఏప్రిల్‌ తరువాత) రూపాయి ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. అలాగే ఒకేరోజు రూపాయి ఈ స్థాయి పతనం కూడా గడచిన ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి.  

భారత్‌ కరెన్సీ మంగళవారం ముగింపు 75.88.   డిసెంబర్‌లో గడచిన 11 ట్రేడింగ్‌ సెషన్లలో తొమ్మిది రోజుల్లో రూపాయి 119 పైసలు (1.58 శాతం) నష్టపోయింది. రూపాయికి ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).  

కారణాలు ఏమిటి? 
అమెరికాసహా పలు దేశాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం తీవ్ర రూపంలో ఉంది. అమెరికాలో అక్టోబర్, నవంబర్‌ నెలల్లో 31 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత రిటైల్‌ ద్రవ్యోల్బణం (వరుసగా 6.2 శాతం, 6.8 శాతం) నమోదయ్యింది.  ఈ పరిస్థితుల్లో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ సరళతర విధానానికి త్వరలో ముగింపు పలకనున్నదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం) పెంచే అవకాశం ఉందని అంచనా ఉంది.
 
ఈ పరిస్థితుల్లో సరళతర ఆర్థిక విధానాలతో విదేశీ మార్కెట్లను ముంచెత్తిన డాలర్లు వెనక్కు మళ్లడం ప్రారంభమైంది. ఫలితంగా ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌ గడచిన నెల రోజులుగా భారీగా బలపడుతోంది. తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులకు డాలర్‌ సురక్షిత ఇన్‌స్ట్రమెంట్‌గా కూడా కనబడుతోంది.
 
దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్లు  తీవ్ర అనిశ్చితికి గురవుతున్నాయి. మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెనక్కు మళ్లుతున్నాయి. ఈ ప్రభావం రూపాయి సెంటిమెంట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.
 
ఇక అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర భయాలు, దేశంలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాలూ రూపాయిని వెంటాడుతున్నాయి.
 
దీనికితోడు కరోనా కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 
ఈ వార్తా రాస్తున్న రాత్రి 8 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ నష్టాల్లో 76.31 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టంగా 96.50 వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top