లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. కారణం అదేనా

Indian Government Banks Reported A Profit Says Icra - Sakshi

ఐదేళ్ల తరువాత లాభాల బాటపట్టిన గవర‍్నమెంట్‌ బ్యాంక్‌లు బాండ్‌ పోర్ట్‌ ఫోలియోల వల్లే లాభాలు సాధ్యమన్న నిపుణులు

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు 2020–21 ఆర్థిక సంవత్సరం సాధించిన నికర లాభాలకు వాటి బాండ్‌ పోర్ట్‌ఫోలియోల నుంచి భారీగా వచ్చిన ఆదాయాలు దన్నుగా నిలిచినట్లు రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా  ఒక నివేదికలో తెలిపింది. ఐదు సంవత్సరాల వరుస నష్టాల అనంతరం 2020–21లో బ్యాంకులు నికర లాభాలు నమోదుచేశాయి. దీనికి వాటి బాండ్‌ పోర్ట్‌ఫోలియోల నుంచి గణనీయంగా లభించిన ఆదాయాలే కారణమని ఇక్రా విశ్లేషించింది. గత కొన్ని సంవత్సరాలుగా తమ మొండి బకాయిల (ఎన్‌పీఏ)కు అధిక కేటాయింపులు (ప్రొవిజన్స్‌) జరుపుతూ వచ్చిన బ్యాంకింగ్, 2020–21లో మాత్రం కొంత తక్కువ ప్రొవిజన్స్‌ జరిపిందని ఇక్రా పేర్కొంది.  బ్యాంకింగ్‌ నికర లాభాలకు ఇదీ ఒక కారణమేనని నివేదిక తెలిపింది.చదవండిఅమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?!

ఆయా అంశాలకు సంబంధించి రేటింగ్‌ సంస్థ తాజా నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 2020 మార్చి–2020 మే మధ్య  బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 115 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం)  తగ్గించింది. అలాగే బ్యాంకులు తమ వద్ద ఉంచిన అదనపు నిధులకు ఇచ్చే వడ్డీరేటు– రివర్స్‌ రెపోను 155 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4, 3.35 శాతాలకు దిగివచ్చాయి.  ఈ పరిస్థితుల్లో బ్యాంకుల బాండ్‌ పోర్ట్‌ఫోలియోలు భారీగా పెరిగాయి. సంబంధిత ట్రేడింగ్‌ లావాదేవీల నుంచి బ్యాంకింగ్‌ భారీ ప్రయోజనాలు పొందింది.  2020–21లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు రూ.32,848 కోట్లయితే, 2019–20లో నికర నష్టాలు రూ.38,907 కోట్లని ఇక్రా వైస్‌ ప్రెసిడెండ్‌ (ఫైనాన్షియల్‌ సెక్టార్‌ రేటింగ్స్‌) అనిల్‌ గుప్తా పేర్కొన్నారు.  

ఏజెన్సీ అంచనాల ప్రకారం 2020–21లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల లాభాలు (పీబీటీ– ప్రాఫిట్‌ బిఫోర్‌ ట్యాక్స్‌) రూ.45,900 కోట్లు. ఇందులో బ్యాంకులు బాండ్‌ పోర్ట్‌ఫోలియోలో ఆదాయాల కారణంగా బుక్‌ చేసిన లా భాలే రూ.31,600 కోట్లు ఉండడం గమనార్హం.  2020–21 వార్షిక డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతం. అయితే రుణ వృద్ధి 5.5 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సైతం రూ 5 నుంచి 7 లక్షల కోట్ల వరకూ ఉంది.  

బ్యాంకింగ్‌లో పదేళ్ల బెంచ్‌మార్క్‌ ప్రభుత్వ సెక్యూరిటీల (బాండ్లు) రోజూవారీ సగటు 2019–20లో 6.42 శాతం. 2020–21 మొదటి త్రైమాసికంలో ఇది ఆరు శాతానికి తగ్గింది. రెండవ త్రైమాసికంలో 5.93 శాతానికి, మూడవ త్రైమాసికంలో 5.90 శాతానికి దిగివచ్చింది. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌  (ఓఎంఓ) ద్వారా బాండ్ల కొనుగోలుతో వ్యవస్థలోకి ఆర్‌బీఐ భారీ నిధులు  పంప్‌ చేయడం, రెపో రేటు కోతల నేపథ్యం ఇది. 2020–21 చివరి త్రైమాసికంలో మాత్రం పదేళ్ల బెంచ్‌మార్క్‌ ప్రభుత్వ సెక్యూరిటీల (బాండ్లు) రోజూవారీ సగటు 6.06 శాతానికి చేరింది.  

ఆయా పరిస్థితుల నేపథ్యంలో చోటుచేసుకున్న బాండ్‌ ఈల్డ్స్‌లో తీవ్ర ఒడిదుడుకులు కూడా బ్యాంకింగ్‌కు చక్కటి ట్రేడింగ్‌ అవకాశాలను కల్పించాయి. బాండ్‌ హోల్డింగ్స్‌పై భారీ ఆదాయాలను బ్యాంకింగ్‌ బుక్‌ చేయడం వల్ల  బ్యాంకులు వాటి తాజా పెట్టుబడులు మార్కెట్‌ రేట్లకు దగ్గరగా ఉంటాయి. తద్వారా వాటి బాండ్‌ పోర్ట్‌ఫోలియోలపై ఈల్డ్స్‌ను తక్కువగా ఉన్న  మార్కెట్‌ రేట్లకు అనుసంధానించగలుగుతుంది.  ప్రభుత్వ బ్యాంకుల ఇన్వెస్ట్‌మెంట్‌ బుక్‌పై ఈల్డ్‌ 2019–20 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) 6.79 శాతం ఉంటే, 2020–21 ఇదే కాలంలో 6.18 శాతానికి తగ్గిందని ఇక్రా వైస్‌ ప్రెసిడెండ్‌ (ఫైనాన్షియల్‌ సెక్టార్‌ రేటింగ్స్‌) అనిల్‌ గుప్తా పేర్కొన్నారు.  

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ని మినహాయిస్తే, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల 2020–21 స్థూల లాభాలు ‘బాండ్‌ పోర్ట్‌ఫోలియో ట్రేడింగ్‌లో బుక్‌ చేసిన ఆదాయాల కన్నా’ తక్కువగా ఉండడం గమనార్హం. ఎస్‌బీఐని మినహాయిస్తే 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్‌ పోర్ట్‌ఫోలియో ట్రేడింగ్‌ లాభాలు రూ.25,500 కోట్లు. స్థూల లాభాలు రూ.18,400 కోట్లు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల తరహాలోనే ప్రైవేటు బ్యాంకులు కూడా తమ బాండ్‌ ట్రేడింగ్‌ లాభాలను 2020–21లో భారీగా రూ.14,700 కోట్ల నుంచి (2019–20) రూ.18,400 కోట్లకు మెరుగుపరచుకున్నాయి. వాటి మొత్తం స్థూల లాభాల్లో ఈ వాటా 21 శాతం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top