అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?!

Credit Suisse Report About Indian Billionaires - Sakshi

ముంబై: ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, అదర్‌ పూనవాలా వీరంతా.. కరోనా మహమ్మారి విరుచుకుపడిన 2020లో సంపదను పెంచుకున్న కుబేరులు. కానీ, అదే ఏడాది దేశంలోని సంపన్నుల ఉమ్మడి సంపద మాత్రం 4.4 శాతం తగ్గి 12.83 లక్షల కోట్ల డాలర్లకు (రూ.919 లక్షల కోట్లు) పరిమితమైనట్టు క్రెడిట్‌ సూసే సంస్థ నివేదికను విడుదల చేసింది. దీనికి కారణం డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడమేనని పేర్కొంది. ఫలితంగా డాలర్‌ రూపంలో మిలియనీర్లు (కనీసం మిలియన్‌ డాలర్లు/రూ.7.4 కోట్లు, అంతకుపైన) చదవండి: ఐపీఓకి మరో మూడు కంపెనీలు, కళకళలాడుతున్న మార్కెట్లు

భారత్‌లో 2019 నాటికి 7,64,000 మంది ఉంటే, 2020 చివరికి 6,98,000కు తగ్గిపోయినట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ సంపన్నుల్లో భారత్‌లో కేవలం 1 శాతం మందే ఉన్నారంటూ.. 2025 నాటికి భారత్‌లోని మిలియనీర్ల సంఖ్య 13 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. ‘‘2020లో భారత్‌లో ప్రతీ వయోజన వ్యక్తి సగటు విలువ 14,252 డాలర్లుగా ఉంది. 2000 నుంచి 2020 మధ్యన చూసే వార్షికంగా 8.8 శాతం పెరిగింది. అదే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సగటు వృద్ధి 4.8 శాతంగానే ఉంది’’అని క్రెడిట్‌సూసే తెలిపింది. 50 మిలియన్‌ డాలర్లు (రూ.370 కోట్లు) అంతకు మించి సంపద కలిగిన వారు భారత్‌లో 4,320 మంది ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.  

52 లక్షల కొత్త మిలియనీర్లు 
అంతర్జాతీయ సంపద 2020లో 28.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 418.4 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్టు క్రెడిట్‌సూసే నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా 52 లక్షల మంది మిలియనీర్లు 2020లో కొత్తగా అవతరించినట్టు.. మొత్తం మిలియనీర్ల సంఖ్య 5.61 కోట్లకు చేరుకున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో మిలియనీర్ల సంఖ్య ఒక శాతానికి పైకి చేరుకున్నట్టు తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 2020లో ప్రతీ గంటకు రూ.90 కోట్ల చొప్పున తన సంపదను పెంచుకున్నట్టు ఇటీవలే హరూన్‌ ఇండియా సంపన్నుల నివేదిక గణాంకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకారం 2020లో ముకేశ్‌ సంపద రూ.2,77,700 కోట్ల మేర పెరిగి రూ.6,58,400 కోట్లకు చేరింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top