మ్యూచువల్‌ ఫండ్స్‌పై రుణాలిస్తాం | Indian banks are increasingly offering loans against mutual funds | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌పై రుణాలిస్తాం

May 21 2026 12:47 AM | Updated on May 21 2026 12:47 AM

Indian banks are increasingly offering loans against mutual funds

వ్యాపార విస్తరణకు బ్యాంక్స్‌ నయా రూటు 

యూనిట్స్‌ విలువలో 50% వరకు లోన్‌ 

ఇప్పటికే అందిస్తున్న కెనరా బ్యాంక్‌ 

ఎంట్రీకి కరూర్‌ వైశ్యా, సీఎస్‌బీ కసరత్తు

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: యువ రిటైల్‌ ఇన్వెస్టర్లు తక్కువ రిటర్నులు వచ్చే బ్యాంకు డిపాజిట్ల కన్నా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. దీనితో బ్యాంకులకు వస్తున్న డిపాజిట్లపరమైన వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. ప్రజల పొదుపు విధానాలు మారుతున్న నేపథ్యంలో యువ కస్టమర్లను ఆకర్షించేందుకు, రుణాల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు కొత్త రూటును ఎంచుకుంటున్నాయి. డిజిటల్‌ విధానంలో ఫండ్స్‌పై రుణాలివ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్‌ గతేడాదే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 

ఈ వ్యాపార విభాగాన్ని మరింతగా విస్తరిస్తోంది. సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఇటీవల మార్చిలో దీన్ని ప్రవేశపెట్టింది. అటు కరూర్‌ వైశ్యా బ్యాంక్, సీఎస్‌బీ బ్యాంక్‌ కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. నెలా, రెణ్నెల్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. ఇలా ఫండ్స్‌పై లోన్‌ విధానంలో అధిక వడ్డీ రేట్లు ఉండే వ్యక్తిగత రుణాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండా రుణగ్రహీతలు తమ దగ్గరున్న ఫండ్‌ యూనిట్లను తనఖాగా ఉంచి లోన్‌ తీసుకోవచ్చు. అదే సమయంలో తమ పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 

35 ఏళ్ల లోపు వారి పొదుపులో సింహభాగం వాటా మ్యూచువల్‌ ఫండ్స్‌దే ఉంటోందని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. ఆర్థిక అత్యవసరాల కోసం ఇలా ఫండ్స్‌పై రుణాలు లభిస్తే, తక్కువ లాభాలకో లేదా నష్టాలకో యూనిట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి కస్టమర్లు ఈ విధానం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌పై రుణాలనేవి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని, మార్కెట్‌ ఆధారిత ఫండ్స్‌కి ప్రాధాన్యం పెరిగే కొద్దీ వీటికి మరింత ఆదరణ లభించగలదని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.  

సంక్లిష్ట ప్రక్రియ .. 
ఫండ్స్‌పై రుణాలివ్వడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ. తనఖా ఉంచిన ఫండ్‌ యూనిట్లను పక్కన పెట్టేలా మార్క్‌ చేసేందుకు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలతో బ్యాంకులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు బ్యాంకులు డిజిటల్‌ మౌలిక సదుపాయాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. సాధారణంగా డిపాజిట్ల విలువలో 80–90% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఫండ్‌ యూనిట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కాబట్టి వాటి విలువ లో 50 శాతమే రుణం ఇచ్చే అవకాశం ఉంటోంది.

రూ. 82 లక్షల కోట్లకు ఫండ్స్‌.. 
దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) గత దశాబ్దకాలంగా అనేక రెట్లు పెరిగింది. మ్యుచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీ గణాంకాల ప్రకారం 2016లో ఏప్రిల్‌ ఆఖరు నాటికి రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం ఈ ఏడాది ఏప్రిల్‌ ఆఖరు నాటికి దాదాపు ఆరు రెట్లు ఎగిసి రూ. 82 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం కుటుంబాల వార్షిక పొదుపులో ఈక్విటీ, మ్యుచువల్‌ ఫండ్స్‌ వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతమే ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 15.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో బ్యాంకు డిపాజిట్ల వాటా 58 శాతం నుంచి 35 శాతానికి తగ్గింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement