పునరుత్పాదక ఇంధన రంగంలోకి భారీ పెట్టుబడులు  | India renewable energy sector may attract 120 bn investment by 2030 | Sakshi
Sakshi News home page

పునరుత్పాదక ఇంధన రంగంలోకి భారీ పెట్టుబడులు 

May 21 2026 6:28 AM | Updated on May 21 2026 6:57 AM

India renewable energy sector may attract 120 bn investment by 2030

ఐదేళ్లలో రూ.11.52 లక్షల కోట్లు  

భూ సమీకరణకే రూ.1.44 లక్షల కోట్లు  

కొలియర్స్‌ ఇండియా నివేదిక అంచనా 

న్యూఢిల్లీ: దేశ పునరుత్పాదక ఇంధన రంగం (సోలార్, పవన విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపన) పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలోకి 110–120 బిలియన్‌ డాలర్ల (రూ.11.52 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు రానున్నట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా వెల్లడించింది. 7 లక్షల ఎకరాల భూ సమీకరణ కోసమే సుమారు 10–15 బిలియన్‌ డాలర్ల (రూ.96,000–1,44,000 కోట్లు) పెట్టుబడులు అవసరమని తెలిపింది. 

2025 చివరికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 250 గిగావాట్లకు చేరుకున్నట్టు తెలిపింది. 2015 నాటికి ఉన్న 80 గిగావాట్లతో పోలి్చతే మూడు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. 2026 మార్చి నాటికి స్థాపిత సామర్థ్యం 275 గిగావాట్లకు చేరినట్టు పేర్కొంది. 2030 నాటికి 270–300 గిగావాట్ల సోలార్, పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా తోడు కానున్నట్టు కొలియర్స్‌ ఇండియా నివేదిక అంచనా వేసింది. 2026–2030 కాలంలో 6.5 లక్షల ఎకరాలు ఒక్క సోలార్‌ ఇన్‌స్టాలేషన్లకే అవసరమవుతుందని.. మిగిలిన 50వేల ఎకరాలు పవన విద్యుత్‌కు కావాల్సి వస్తుందని పేర్కొంది.  

500 మెగావాట్ల లక్ష్యం సాధ్యమే 
సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం ఒక్కో మెగావాట్‌కు రూ.3–4 కోట్లు, పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల (భూమిపై)కు సంబంధించి ఒక మెగావాట్‌ సామర్థ్యం కోసం రూ.8–9 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని కొలియర్స్‌ ఇండియా తెలిపింది. దేశీయంగా తయారీ సామర్థ్యాలు మరింత మెరుగుపడుతున్నందున 2030 నాటికి భారత్‌ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సులభంగానే చేరుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. అప్పటికి ఒక్క సోలార్‌ ప్రాజెక్టుల సామర్థ్యమే 400–450 గిగావాట్ల మేర ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం 146 గిగావాట్ల సామర్థ్యం మేర ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపింది. పునరుత్పాదక విద్యుత్‌ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అవకాశాలు కలి్పస్తుందని.. ముఖ్యంగా భూ సమీకరణ, పునరుత్పాదక ఆధారిత పారిశ్రామిక పార్కుల్లో అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement