డిసెంబర్‌లో ‘తయారీ’ మరింత పటిష్టం

India manufacturing sector activity strengthens in December - Sakshi

56.3 నుంచి 56.4కు పీఎంఐ సూచీ

న్యూఢిల్లీ: భారత్‌ తయారీ రంగం డిసెంబర్‌లో మరింత పటిష్టమైంది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) డిసెంబర్‌లో 56.4కు ఎగసింది. నవంబర్‌లో ఇది 56.3 వద్ద ఉంది. పీఎంఐ సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా భావించడం జరుగుతుంది. ఆ లోపు నమోదయితే క్షీణతగా భావిస్తారు. తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా ఐదవనెల. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, రికవరీ, డిమాండ్‌ పరిస్థితులు బాగుండడం, ఉత్పత్తి పెంపు ద్వారా నిల్వలు మెరుగుపరచుకోడానికి కంపెనీల యత్నాలు వంటి అంశాలు తయారీ రంగం పురోగతికి కారణమని ఐహెచ్‌ఎస్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డీ లిమా పేర్కొన్నారు.

అయితే ఉపాధి అవకాశాలు డిసెంబర్‌లోనూ మెరుగుపడలేదని ఆయన వివరించారు. ఉపాధి కల్పన క్షీణతలో ఉండడం ఇది వరుసగా తొమ్మిదవసారి. కాగా ముడి సరుకు  ధరల పెరుగుదల తీవ్రంగానే ఉందని, డిసెంబర్‌లో ఇది 26 శాతానికి చేరిందని పోలియానా డీ లిమా తెలిపారు. రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)తో పోల్చితే మూడవ త్రైమాసికం  (అక్టోబర్‌–డిసెంబర్‌)లో తయారీ రంగం మెరుగుపడిందని ఆయన పేర్కొంటూ, సూచీ 51.6  నుంచి 57.2కు చేరిందని అన్నారు.  వరుసగా 36 నెలలు సూచీ 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ, కరోనా కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్‌లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top