వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే? | India Growth Outlook Brightens S and P Projects 7 1 percent GDP Expansion for FY2026 27 | Sakshi
Sakshi News home page

వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?

Mar 26 2026 4:54 PM | Updated on Mar 26 2026 4:54 PM

India Growth Outlook Brightens S and P Projects 7 1 percent GDP Expansion for FY2026 27

భారత్‌కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) 7.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. పూర్వపు అంచనా కంటే 0.20 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం గతంలో పేర్కొన్న అంచనాలతో పోల్చితే 0.4 శాతం పెంచి 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది.

ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం కారణంగా అధిక ఇంధన ధరలు ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడి కలిగించొచ్చని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరమైన అనిశ్చితులు కారణంగా ఏర్పడే రిస్కులు భారత్‌పై ప్రభావం చూపించొచ్చని (కమోడిటీ ధరలు, ఎగుమతులు, పెట్టుబడుల రాకపై) పేర్కొంది.

చమురు ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగితే భారత్‌లో విక్రయ ధరలు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. అయితే ధరల పెరుగుదల భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపే అవకాశం లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2026–27లో 4.3 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. అధిక చమురు ధరలు వాణిజ్యలోటు పెరిగేందుకు కారణం కావొచ్చంటూ.. సేవల ఎగుమతుల రూపంలో మిగులు ఈ లోటును పరిమితం చేస్తుందని వివరించింది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా, స్థిరంగా కొనసాగించొచ్చని అంచనా వేసింది.

చమురు ధరల సెగలు.. 
జూన్‌ త్రైమాసికంలో బ్రెంట్‌ బ్యారెల్‌కు సగటున 92 డాలర్ల స్థాయిలో, 2026లో సగటున 80 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే జూన్‌ త్రైమాసికంలో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌కు 185 డాలర్ల స్థాయికి, 2026 వ్యాప్తంగా 130 డాలర్ల స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement