గోల్డ్‌కు గ్లోబల్‌ జోష్‌  | India gold investment demand tops jewellery for first time in March quarter | Sakshi
Sakshi News home page

గోల్డ్‌కు గ్లోబల్‌ జోష్‌ 

Apr 30 2026 4:20 AM | Updated on Apr 30 2026 4:20 AM

India gold investment demand tops jewellery for first time in March quarter

జువెలరీ డిమాండ్‌ డౌన్‌... పెట్టుబడుల్లో రికార్డ్‌ రన్‌ 

మార్చి క్వార్టర్‌లో 54 శాతం అధికం 

ఆభరణాల డిమాండ్‌ 66 టన్నులు 

19 శాతం తగ్గుదల మొత్తం డిమాండ్‌ 151 టన్నులకు చేరిక 

ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక

ముంబై: దేశంలో బంగారానికి గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) గతేడాది ఇదే కాలంతో పోలిస్తే బంగారం డిమాండ్‌ 10 శాతం వృద్ధి చెంది 151 టన్నులకు చేరింది. ముఖ్యంగా ఆభరణాల కంటే పెట్టుబడి రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం చూపిస్తున్నారు.  

నివేదికలోని అంశాలు.. 
→ బంగారం కడ్డీలు, నాణేలు, ఈటీఎఫ్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) రూపంలో పెట్టుబడి డిమాండ్‌ మార్చి క్వార్టర్‌లో 54 శాతం పెరిగి 82 టన్నులకు చేరుకుంది. ఇందులో కడ్డీలు, కాయిన్ల డిమాండ్‌ వరకే చూస్తే 34 శాతం పెరిగి 62 టన్నులుగా ఉంది. 2013 తర్వాత తొలి త్రైమాసికంలో అత్యధిక డిమాండ్‌ ఇదే కావడం విశేషం. 
→ అధిక ధరల కారణంగా ఆభరణాల డిమాండ్‌ 19 శాతం తగ్గి 66 టన్నులకు పరిమితమైంది. పెరిగిన ధరలు సామాన్యుల బడ్జెట్‌పై ప్రభావం చూపించడమే దీనికి కారణం. 
→ ధరల పెరుగుదలతో బంగారం డిమాండ్‌ విలువ పరంగా రెట్టింపయ్యింది. మార్చి త్రైమాసికంలో కొనుగోళ్ల విలువ రూ.2,27,500 కోట్లుగా నమోదైంది. 
→ మార్చి క్వార్టర్‌లో బంగారం ధర ఎంసీఎక్స్‌లో 81 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారం సగటు ధర 1,51,108 రూపాయల స్థాయిలో కొనసాగింది. 2025 మొదటి త్రైమాసికంలో ఇది రూ.83,375గా ఉంది.  

ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ధోరణి.. 
ప్రపంచవ్యాప్తంగా 2026 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) బంగారానికి గిరాకీ(డిమాండ్‌) 2 శాతం పెరిగి 1,231 టన్నులకు చేరిందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడికి సురక్షిత సాధనంగా భావించి కడ్డీలు, నాణేల కొనుగోలుకు మొగ్గు చూపించినట్టు తెలిపింది. కడ్డీలు, నాణేల రూపంలో పెట్టుబడి డిమాండ్‌ ఏకంగా 42 శాతం పెరిగి 474 టన్నులకు చేరింది. విలువ పరంగా డిమాండ్‌ 193 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 74 శాతం అధికం. ధరలు పెరగడమే ఇంత వృద్ధికి కారణం. 2025లో ఔన్సు బంగారం ధర సగటున 2,860 డాలర్లు ఉండగా, 2026 మొదటి త్రైమాసికంలో అది 81 శాతం పెరిగి 4,873 డాలర్లకు చేరింది. జనవరిలో ధరలు 5,400 డాలర్ల రికార్డు గరిష్టాన్ని కూడా నమోదు చేయడం గమనార్హం. అధిక ధరలతో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్‌ 23 శాతం తగ్గి 300 టన్నులకు పరిమితమైంది. చైనాలో 32 శాతం, భారత్‌లో 19 శాతం చొప్పున విక్రయాలు తగ్గాయి. 

సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లు 
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు మార్చి త్రైమాసికంలో అదనంగా 244 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆర్‌బీఐ సైతం ఈ కాలంలో 300 కిలోల బంగారాన్ని సమకూర్చుకుంది. గనుల నుంచి  బంగారం ఉత్పత్తి మోస్తరుగా పెరగొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పెట్టుబడి డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.  

రీసైక్లింగ్‌కూ డిమాండ్‌ 
ధరలు భారీగా పెరగడంతో పాత బంగారాన్ని విక్రయించి లాభాలు పొందే ధోరణి కూడా పెరిగింది. బంగారం రీసైక్లింగ్‌ 20 శాతం పెరిగి 31.2 టన్నులకు చేరింది. అలాగే, దేశీ అవసరాల కోసం దిగుమతులు 39 శాతం పెరిగి 186 టన్నులకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోందని డబ్ల్యూజీసీ భారత్‌ సీఈవో సచిన్‌ జైన్‌ తెలిపారు. రాబోయే వివాహాల సీజన్, పండుగలు ఆభరణాల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయంటూ.. ఈ ఏడాది మొత్తం మీద డిమాండ్‌ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉండొచ్చని అంచనా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement