ఇంధన దాహం.. జల వినాశం! | India Ethanol Push Green Energy Dream or Water Crisis Nightmare | Sakshi
Sakshi News home page

ఇంధన దాహం.. జల వినాశం!

Apr 29 2026 9:32 PM | Updated on Apr 29 2026 9:38 PM

India Ethanol Push Green Energy Dream or Water Crisis Nightmare

భారతదేశం ఇంధన స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి విదేశీ ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే, ఈ గ్రీన్ ఎనర్జీ ప్రస్థానం దేశాన్ని మరో పెను ప్రమాదంలోకి నెట్టేస్తోందా? అనే ప్రశ్న ప్రస్తుతం పర్యావరణవేత్తలను వేధిస్తోంది. ఒక లీటరు ఇథనాల్ తయారీకి దాదాపు 10,000 లీటర్ల నీరు ఖర్చవుతోందన్న వాస్తవం ఇప్పుడు దేశ జల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

బియ్యం నుంచి ఇంధనం

ప్రభుత్వం 2024-25లో ఇథనాల్ ఉత్పత్తి కోసం 52 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. రాబోయే 2025-26 నాటికి ఈ లక్ష్యాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఆహార సరఫరా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే విరిగిన బియ్యం వాటాను 25% నుంచి 10%కి తగ్గించనున్నారు. దీనివల్ల మిగిలిన బియ్యాన్ని నేరుగా ఇథనాల్ తయారీ డిస్టిలరీలకు మళ్లిస్తారు. అయితే, ఆహార భద్రత కంటే ఇంధన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

నీటి వినియోగం గణాంకాలు ఇలా..

ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇథనాల్ తయారీకి పంటల వారీగా నీటి వినియోగం కింది విధంగా ఉంది.

పంట రకంఒక లీటరు ఇథనాల్‌కు అవసరమయ్యే నీరు
బియ్యం (వరి)10,790 లీటర్లు
మొక్కజొన్న4,670 లీటర్లు
చెరకు3,630 లీటర్లు

 

ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీరు అవసరమైతే ఒక టన్ను బియ్యం నుంచి కేవలం 470 లీటర్ల ఇథనాల్ మాత్రమే లభిస్తుంది. అంటే, మనం వాహనాల్లో వాడే ఇంధనం ఎంత భారీ స్థాయిలో జల వనరులను హరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

పెరుగుతున్న కాలుష్యం

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు నిండుకునే ప్రమాదం ఉంది. ఇటువంటి తరుణంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనే ఇథనాల్ ప్లాంట్లు కేంద్రీకృతమవ్వడం గమనార్హం. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో తాగునీటికే కటకటలాడుతున్న స్థితిలో అక్కడ 396 కోట్ల లీటర్ల ఇథనాల్‌ సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలో కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్న ప్రాంతాల్లోనే ఇథనాల్ తయారీ జోరుగా సాగుతోంది. ఇథనాల్ మిల్లులు విడుదల చేసే వినాస్సే (Vinasse) అనే వ్యర్థ జలాలు భూమిలోకి చేరితే భూగర్భ జలాలు, ఉపరితల జలాలు పూర్తిగా కలుషితమవుతాయని కొందరు చెబుతున్నారు.

వైరుధ్యాల వలయం

ఒకప్పుడు పంజాబ్, హరియాణా వంటి ప్రాంతాల్లోని రైతులు వరి పండించి భూగర్భ జలాలను తోడేస్తున్నారని విమర్శించిన వ్యవస్థే ఇప్పుడు అదే ధాన్యాన్ని పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పేరుతో ఇంధనంగా మారుస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో దేశాన్ని మంచినీటి చుక్క కోసం అల్లాడేలా చేసేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

క్లీన్ ఎనర్జీ లక్ష్యం గొప్పదే అయినా అది దేశ జల వనరులను బలిపెట్టేదిగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యం, చెరకు వంటి నీటి తీవ్రత పంటల కంటే ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి: ‘మస్క్‌ దొంగ ఏడుపు దేనికి?’

Advertisement
 
Advertisement
Advertisement