‘మస్క్‌ దొంగ ఏడుపు దేనికి?’ | Elon Musk vs Sam Altman OpenAI Battle Reaches Crucial Stage in San Francisco | Sakshi
Sakshi News home page

‘మస్క్‌ దొంగ ఏడుపు దేనికి?’

Apr 29 2026 7:07 PM | Updated on Apr 29 2026 7:41 PM

Elon Musk vs Sam Altman OpenAI Battle Reaches Crucial Stage in San Francisco

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్‌ ఆల్టమన్‌, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య సాగుతున్న న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది. మస్క్ దాఖలు చేసిన దావాపై కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్టులో వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. ఓపెన​్‌ఏఐ సంస్థ స్థాపన లక్ష్యాలను తుంగలో తొక్కారన్న మస్క్ ఆరోపణలు, మరోవైపు మస్క్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారన్న ఓపెన్ ఏఐ వాదనలతో ఈ కేసు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

2015లో ఓపెన్ ఏఐ స్థాపన సమయంలో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మన్ వంటి దిగ్గజాలు ఒక్కటయ్యారు. అప్పట్లో మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఏజీఐ అభివృద్ధి, లాభాపేక్ష లేని పరిశోధనలు అనేవి ప్రధాన సూత్రాలుగా ఉండేవి. 2018 వరకు బోర్డులో చురుగ్గా ఉన్న మస్క్, ఆ తర్వాత సంస్థ విధానాలను వ్యతిరేకిస్తూ అందులో నుంచి వైదొలిగారు. ప్రస్తుతం కోర్టులో సాక్ష్యమిచ్చిన మస్క్, సంస్థ మూల సూత్రాల నుంచి తప్పుకుందని మండిపడ్డారు. ‘నేనే ఈ ఆలోచనను ప్రారంభించాను, పేరు పెట్టాను, కీలక నిపుణులను నియమించాను, భారీగా నిధులు సమకూర్చాను. ఇది నా బ్రెయిన్ చైల్డ్. కానీ ఇప్పుడు దాని తీరుతెన్నులే మారిపోయాయి’ అన్నారు.

మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..

మస్క్ నిష్క్రమణ తర్వాత 2019లో ఓపెన్ ఏఐ ‘క్యాప్డ్ ప్రాఫిట్’ (పరిమిత లాభాపేక్ష) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. అజూర్, కోపైలట్ వంటి ఉత్పత్తుల్లో ఓపెన్ ఏఐ సాంకేతికతను వాడటంపై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓపెన్ ఏఐ మళ్లీ పాత లాభాపేక్షలేని మోడల్‌కు మారాలి. దాదాపు 134 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ప్రస్తుత నాయకత్వంలో మార్పులు జరగాలి’ అని మస్క్‌ అంటున్నారు.

ఓపెన్ ఏఐ కౌంటర్

మస్క్ ఆరోపణలను ఓపెన్ ఏఐ తరపు న్యాయవాది విలియం సావిట్ తీవ్రంగా ఖండించారు. సంస్థ లాభాపేక్షలేనిదిగా ఉండటానికి ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేదని ఆయన వాదించారు. ఆధునిక ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి బిలియన్ల కొద్దీ నిధులు, భారీ మౌలిక సదుపాయాలు అవసరమని అందుకే నిర్మాణంలో మార్పులు చేశామని స్పష్టం చేశారు. ‘మిస్టర్ మస్క్ కోరుకున్నట్లుగా సంస్థపై నియంత్రణ దక్కలేదు కాబట్టే ఈ దావా వేశారు. గతంలో ఆయనే స్వయంగా సంస్థపై ఎక్కువ నియంత్రణ కోసం ఒత్తిడి చేశారు. ఇప్పుడు దొంగ ఏడుపు నటిస్తున్నారు’ అని సావిట్ కోర్టుకు వివరించారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సైతం తన పాత ప్రకటనలను సమర్థించుకుంటూ.. ‘ప్రపంచస్థాయి మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి సాధారణంగా సేకరించే నిధుల కంటే ఎక్కువ మూలధనం అవసరం. మా లక్ష్యం ఎప్పుడూ మానవాళి శ్రేయస్సే’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్‌ ఆఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement