బీవోపీకి సంబంధించి ప్యాకేజీ అవసరం
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఎస్‌బీఐ అధ్యయన విభాగం నివేదిక అంచనా వేసింది. రూపాయి విలువ క్షీణిస్తుండడం, అధిక ముడి చమురు ధరల నేపథ్యంలో బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీవోపీ/క్యాడ్)కు సంబంధించి ప్యాకేజీ అవసరమని పేర్కొంది. రూపాయి ఇటీవలి కాలంలో గణనీయంగా నష్టపోవడం తెలిసిందే. డాలర్‌తో 95 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ‘‘బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు మించిపోవడంతో.. రవాణా, బీమా ఖర్చులు పెరిగిపోయాయి.
కనుక బీవోపీ పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు అవసరం. డాలర్‌తో రూపాయి 95 స్థాయిలోనే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.04 ట్రిలియన్ డాలర్లకు పడిపోతుంది. దీంతో 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్న స్వప్నం 2029–30లోనే సాధ్యపడుతుంది’’అని ఈ నివేదిక తెలిపింది. రూపాయి వేగంగా విలువను కోల్పోతుండడానికి తోడు తీవ్ర ఆటుపోట్లు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. 2025–26 చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7.5 శాతం వద్ద ఉండొచ్చని అంచనా వేసింది.
వృద్ధి 6 శాతమే: హెచ్‌ఎస్‌బీసీ
ఇంధన ధరల పెరుగుదల/సరఫరా సంక్షోభానికి తోడు, ఎల్‌నినోతో వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు, ద్రవ్యలోటు పెరిగే పరిస్థితులతో భారత్ జీడీపీ వృద్ధి 2026–27లో 6 శాతానికి పరిమితం కావొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. ఈ పరిస్థితులతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని.. ఫలితంగా ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను రెండు సార్లు (వచ్చే డిసెంబర్, మార్చి సమీక్షల్లో) పెంచొచ్చని అంచనా వేసింది.
ప్రస్తుత సంక్షోభం సంఘటిత రంగం, చిన్న సంస్థలు, గ్రామీణ గృహాలపై భారం మోపుతుందని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలతో సాగు కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. 2026–27లో ద్రవ్యోల్బణం 5.6 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. రెండు త్రైమాసికాల్లో 6 శాతాన్ని మించొచ్చని పేర్కొంది. చమురు మార్కెటింగ్ సంస్థలపై భారం తగ్గించేందుకు పెట్రోల్ లీటర్‌పై రూ.7 వరకు పెంచొచ్చని అంచనా వేసింది. పెంపు లేకపోతే మాత్రం అప్పుడు ద్రవ్యోల్బణం 5.3 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది.


