రెండు ట్రిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ వాణిజ్యం లక్ష్యం

India Aspiring To Take International Trade To 2 Trillion dollers By 2030 - Sakshi

2030 నాటికి భారత్‌ లక్ష్యమన్న పీయూష్‌ గోయెల్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: భారత్‌ వస్తు, సేవల ఎగుమతులు గత సంవత్సరం ముగిసే నాటికి 675 బిలియన్‌ డాలర్లు దాటాయని, 2030 నాటికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని 2 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలని దేశం ఆకాంక్షిస్తున్నదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఇక్కడి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో సంభాషించిన గోయల్‌ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ,  భారతదేశం తన స్వాతంత్య్ర 100వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సమయానికి,  30 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఉద్ఘాటించారు.

ప్రభుత్వ ప్రణాళికలు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ విలువ 35 నుంచి 45 ట్రిలియన్ల స్థాయినీ అందుకోగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ల ఎకానమీతో భారత్‌ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. భారత్‌  ముందు వరుసలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు ఉన్నాయి.  దశాబ్దం క్రితం భారత్‌ 11వ స్థానంలో ఉండేది. జూన్‌ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధితో బ్రిటన్‌ను భారత్‌ ఎకానమీ ఆరవ స్థానంలోకి నెట్టింది.  

తక్షణం ఇబ్బందులే...
కాగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ మందగమనం, అనిశ్చితి వంటి పరిస్థితుల్లో భారత్‌ ఎగుమతులు కష్టకాలాన్ని ఎదుర్కొన తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాలు వంటి రంగాలు ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, రష్యా–ఉక్రెయిన్, చైనా–తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు, సరఫరాల సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి వేగానికి, డిమాండ్‌ బలహీనతకు కారణమవుతున్న సంగతి తెలిసిందే.  భారత్‌ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఎగుమతుల క్షీణత–భారీ దిగుమతులపై ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు కూడా ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే ఐదు నెలల కాలంలో 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 53.78 బిలియన్‌ డాలర్ల నుంచి 125.22 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2021–22లో భారత్‌ వస్తు ఎగుమతుల విలువ ఎగుమతులు 400 బిలియన్‌ డాలర్లు.   

యూఎస్‌ ఇన్వెస్టర్లతో స్టార్టప్స్‌ అనుసంధానం
భారత స్టార్టప్స్‌ను యూఎస్‌ ఇన్వెస్టర్లతో అనుసంధానించేందుకు.. సపోర్టింగ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ ఇన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ అప్‌స్కిల్లింగ్‌ (సేతు) పేరుతో కార్యక్రమానికి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ శ్రీకారం చుట్టారు. భారత్‌లో వ్యవస్థాపకత, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న యూఎస్‌లోని ఇన్వెస్టర్ల మధ్య భౌగోళిక అడ్డంకులను అధిగమించడానికి సేతు  రూపొందించారు. నిధుల సమీకరణ, ఉత్పత్తుల విక్రయం, వాణిజ్యీకరణకై ఇన్వెస్టర్లు మార్గదర్శకత్వం వహిస్తారు.

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని స్టార్టప్స్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు భారత్‌లో అడ్వైజరీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసినట్టు గోయల్‌ తెలిపారు. స్టార్టప్స్‌లో 90 శాతం, అలాగే నిధులు అందుకున్న స్టార్టప్స్‌లో సగం ప్రారంభ దశలోనే విఫలం అవుతున్నాయని గుర్తు చేశారు. వ్యాపారాన్ని నిర్వహించడంలో అనుభవం లేకపోవడం ఒక కీలక సమస్య అని అన్నారు. నిర్ణ­యం తీసుకోవడానికి, నైతిక మద్దతు కోసం వ్యవస్థాపకులకు సరైన మార్గదర్శకత్వం అవసరమని వివరించారు. స్టార్టప్స్‌కు అండగా నిలిచేందుకు మార్గ్‌ కార్యక్రమంలో ఇప్పటి వరకు 200 పైచిలుకు మెంటార్స్‌ పేర్లు నమోదు చేసుకున్నారు.
స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో మాట్లాడుతున్న గోయల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top