ఫారమ్‌ 15 G/H బదులుగా ఫారమ్‌ 121 | Income Tax Update Form 121 Replaces 15G and 15H for FY 2026-27 | Sakshi
Sakshi News home page

Income Tax: ఫారమ్‌ 15 G/H బదులుగా ఫారమ్‌ 121

Apr 13 2026 11:26 AM | Updated on Apr 13 2026 11:34 AM

Income Tax Update Form 121 Replaces 15G and 15H for FY 2026-27

కొత్త చట్టం, కొత్త రూల్స్‌తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్‌ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది.  

కొత్త ఫారమ్‌ ఎందుకు దాఖలు చేయాలి? 
విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్‌ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్‌ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్‌ బుక్‌ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్‌కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్‌ సబ్మిట్‌ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్‌ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్‌ కట్‌ చేస్తారు. అందుకని 121 వేయండి.

పాత ఫారమ్‌లు ఇక ఉండవా..? 
1.4.2026 నుంచి పాత ఫారమ్‌లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్‌ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్‌. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి.  

టీడీఎస్‌ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. 
ఫారమ్‌ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్‌ హోల్డర్లకి పాన్‌ లేకపోతే టీడీఎస్‌ 20% చొప్పున చేస్తారు. పాన్‌ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్‌తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్‌మెంట్‌ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్‌ 20 శాతం కట్‌ చేస్తారు.  

క్యాపిటల్‌ గెయిన్స్‌ ఆదాయం ఉంటే ..  
ఫారమ్‌ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్‌ గెయిన్స్‌ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్‌ గెయిన్స్‌ మీద ఆదాయం ఉంటే ఫారమ్‌ 121 వేయకూడదు.  

కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 
2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్‌ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్‌ గెయిన్స్‌ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్‌ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్‌ గెయిన్స్‌ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్‌ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్‌ గెయిన్స్‌ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్‌ 121 ఇవ్వడం సముచితము.  

రెండు విభిన్న ఆలోచనలు ..  
ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్‌ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్‌ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్‌ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్‌ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్‌ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. 

ఫారమ్‌ 121 గురించి సాంకేతిక సమాచారం .. 
ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్‌  అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్‌  ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్‌ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్‌మెంట్‌ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్‌ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్‌లో వివరాలు ఇతర ఫారాలతో లింక్‌ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్‌డేట్‌ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement