చైనా మొబైల్‌ కంపెనీల్లో ఐటీ శాఖ తనిఖీలు

Income Tax department conducts raids at OnePlus, Xiaomi, and Oppo India offices - Sakshi

న్యూఢిల్లీ: భారత మొబైల్‌ ఫోన్స్‌ పరిశ్రమలో దూకుడుగా ఉన్న చైనా కంపెనీలకు షాక్‌ తగిలింది. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్‌ప్లస్‌ మొబైల్‌ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టు నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలపై చాలా కాలంగా ఐటీ నిఘా ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చితమైన సమాచారంతోనే కంపెనీల సీఈవోలు, ఇతర ప్రతినిధులను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్‌ నోయిడా, కోల్‌కత, గువాహటి, ఇందోర్‌తోపాటు పలు ప్రాంతాల్లో 24కుపైగా కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్‌ సమాచారాన్ని గుర్తించి, సీజ్‌ చేసినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు షావొమీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో టెలికం పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top