పెట్టుబడుల్లో రిస్క్‌ తగ్గించుకునే మార్గం

ICICI Prudential Multi Asset Fund Review - Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ రివ్యూ

ఈక్విటీ మార్కెట్‌ ఇటీవలి కాలంలో చక్కని ర్యాలీతో గరిష్ట విలువలకు చేరింది. కనుక అస్సెట్‌ అలోకేషన్‌ విధానాన్ని (ఒక్క విభాగంలోనే కాకుండా భిన్న సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం) అనుసరించాలంటూ ఆర్థిక సలహాదారులు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకుని, రిస్క్‌ తగ్గించుకోవాలని భావించే వారికి అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. వివిధ సాధనాల మధ్య వ్యూహాత్మక స్థాయిలో కేటాయింపులు అనేవి అన్ని వేళలా ఇన్వెస్టర్లకు రిస్క్‌ నుంచి రక్షణ కల్పిస్తాయని మార్కెట్‌ పండితులు అభిప్రాయపడుతుంటారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని భావిస్తుంటే.. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎంతో పేరున్న ఎస్‌.నరేన్‌ ఈ ఫండ్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తుండడం సానుకూలాంశం. ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది.  
పెట్టుబడుల విధానం.. 
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ ఈక్విటీలకు.. పరిస్థితులకు అనుగుణంగా 10 శాతం నుంచి 80 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. అలాగే, డెట్‌ సాధనాలకు 10 శాతం నుంచి 35 శాతం వరకు, బంగారం ఈటీఎఫ్‌లకు 0–10 శాతం వరకు, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లకు (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)లకు 0–10 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటుంది. దాదాపు అన్ని రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఈ ఒక్క పథకం ద్వారా సాధ్యపడుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ మూడు అంతకంటే ఎక్కువ సాధనాల్లో.. కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.  
రాబడులు 
మల్టీ అస్సెట్‌ ఫండ్‌ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీ అస్సెట్‌ ఫండ్‌ మెరుగైన, స్థిరమైన పనితీరు చూపిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని తప్పకుండా పరిశీలించొచ్చు. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో మల్టీ అస్సెట్‌ ఫండ్స్‌ విభాగం సగటు రాబడులు 32 శాతంగానే ఉన్నాయి. మూడేళ్లలో చూసినా కానీ, వార్షిక రాబడులు 18 శాతంగా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఐదేళ్లలో 15 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 15 శాతం చొప్పున రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఏ కాలంలో చూసినా కానీ, మల్టీ అస్సెట్‌ విభాగం సగటుతో పోల్చి చూస్తే ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా కనిపిస్తుంది. ఈక్విటీతో కూడిన పథకం కనుక దీర్ఘకాలంలో 12 శాతం అంతకుమించి వార్షిక రాబడులను మెరుగైన పనితీరుగా భావించొచ్చు. 2002 అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూస్తే ఒక యూనిట్‌ నికర అస్సెట్‌ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) 39 రెట్లు వృద్ధి చెందింది. అంటే ఆరంభంలో చేసిన రూ.10 పెట్టుబడి రూ.390గా వృద్ధి చెందింది. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసినా కానీ, నేటికి రూ.5.36 లక్షలుగా వృద్ధి చెందేది. ఈ పథకం ప్రారంభం నుంచి చూస్తే వార్షిక రాబడులు 14 శాతానికి పైనే ఉన్నాయి.  
పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.12,405 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈక్విటీ పెట్టుబడులు 66 శాతంగా ఉన్నాయి. డెట్‌లో 10.9 శాతం మేర పెట్టుబడులు పెట్టి ఉంటే, 23 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది. అంటే మూడు విభాగాల్లోనే ప్రస్తుతం పెట్టుబడులు పెట్టి ఉంది.  

టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 
కంపెనీ              పెట్టుబడుల శాతం 

ఎన్‌టీపీసీ                    9.41 
భారతీ ఎయిర్‌టెల్‌       7.90 
ఐసీఐసీఐ బ్యాంకు       7.73 
ఓఎన్‌జీసీ                   5.59 
సన్‌ఫార్మా                  3.75 
హిందాల్కో                3.31 
ఇన్ఫోసిస్‌                 2.56 
ఎస్‌బీఐ                    2.26 
ఐటీసీ                      2.15 
మారుతి సుజుకీ         2.01  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top