ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ మెరుగు | Hyderabad Sees Growth in Home Sales | Sakshi
Sakshi News home page

ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ మెరుగు

Apr 9 2026 10:02 AM | Updated on Apr 9 2026 10:13 AM

Hyderabad Sees Growth in Home Sales

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–మార్చి త్రైమాసికంలో ఢీలాపడ్డాయి. హైదరాబాద్‌లో సానుకూల ధోరణి కనిపించింది. అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. మొత్తం మీద హైదరాబాద్‌ సహా టాప్‌–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి మూడు నెలల్లో అమ్మకాలు 88,361 యూనిట్లతో పోల్చితే 4 శాతం తగ్గాయి.

అధిక ధరలకు తోడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితులు అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు బలమైన వృద్ధి అనంతరం మార్కెట్‌లో స్థిరీకరణ సహజమేనని నైట్‌ఫ్రాంక్‌ చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ పేర్కొన్నారు. ధరలు పెరుగుతూ ఉండడం, విక్రయాలు తగ్గడం అన్నది ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిళ్లను తెలియజేస్తున్నట్టు చెప్పారు. మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం సైతం ఉన్నట్టు తెలిపారు.

నగరాల వారీ డేటా..

  • హైదరాబాద్‌లో 9,541 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలతో పోల్చి చూస్తే 1 శాతం పెరిగాయి.

  • బెంగళూరులోనూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇళ్ల అమ్మకాలు 5 శాతం పెరిగి 13,092 యూనిట్లుగా ఉన్నాయి.

  • చెన్నైలో 9 శాతం అధికంగా 4,763 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.

  • అహ్మదాబాద్‌లో 2 శాతం అధికంగా 4,758 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

  • కోల్‌కతాలో 4,043 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 5 శాతం వృద్ధి నమోదైంది.

  • ముంబైలో ఇళ్ల విక్రయాలు 7 శాతం పడిపోయి 23,185 యూనిట్లకు పరిమితమయ్యాయి.  

  • ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 12,711 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తగ్గాయి.  

  • పుణెలోనూ 11 శాతం తక్కువగా 12,711 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.

  • జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గి 94,855 యూనిట్లకు పరిమితమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement