అంతర్జాతీయంగా అదరగొడుతున్న హైదరాబాద్ ఈవీ స్టార్టప్ కుర్రాళ్ళు..!

Hyderabad Boys Drive Affordable Electric Mobility Solutions Across The Globe - Sakshi

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మనదేశంలో కూడా అనేక ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అందులోనూ మన హైదరాబాద్ నగరానికి చెందిన ఒక సంస్థ.. హైదరాబాద్ నుంచి అమెరికా వరకూ ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఏకంగా, ఇతర భాగస్వాములతో కలిసి అమెరికాలోనే వాహనాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఇంకా, ఆ దేశంలో ఐపీఓ వెళ్లేందుకు కూడా సిద్దం అవుతుంది. ఆ కంపెనీ పేరే "గాయం మోటర్ వర్క్స్". ఈ కంపెనీని రాజా గాయం, రాహుల్ గాయం, హర్ష బవిరిసెట్టి ఈ ముగ్గురు కలిసి స్థాపించారు. 

ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఆ స్టార్టప్‌కు తోడుగా ఇతర భాగస్వాములతో కలిసి బిలిటీ ఎలక్ట్రిక్ పేరుతో 2021లో మరొక ఈ-వెహికిల్స్ స్టార్టప్‌ను మొదలుపెట్టారు. త్వరలోనే బిలిటీ ఎలక్ట్రిక్ సంస్థను యూఎస్ షేర్ మార్కెట్‌లో ఐపీఓ లిస్టింగ్ చేస్తామని సీఓఓ బవిరిసెట్టి చెబుతున్నారు. లక్సెంబర్గ్'కి చెందిన GEM(గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్) నవంబర్ 2021లో బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీలో $400 మిలియన్ పెట్టుబడులు పెట్టారు.
 

ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ గమనించిన హైదరాబాద్ నగరానికి చెందిన ఈ ముగ్గురు యువకులు పర్యావరణానికి మేలు చేసే ఈ-వెహికిల్స్‌ స్టార్టప్ ప్రారంభించాలని భావించారు. 2010లో గయామ్ సోదరులు జీఎండబ్ల్యూను ఏర్పాటు చేయడానికి తండ్రి కర్మాగారాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ వారు ఆటోలను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. "మేము టాటా నానోను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంగా మార్చాము. దీనిని సుమారు ఒక సంవత్సరం పాటు పరీక్షించాము. కానీ, మొదట ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయడానికి బయట నుంచి వీడి భాగాలను కొనుగోలు చేశాము. దీంతో, వాహన ఖర్చు రూ.7-8 లక్షల వరకు పెరిగింది" అని రాహుల్ చెప్పారు. ఆ తర్వాత తయారీ ఖర్చుని తగ్గించేందుకు వీళ్లే సొంతగా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ అండ్‌ డీ)ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆటో తయారీకి అవసరమైన పరికరాలను, విడి భాగాలను కావలసిన ప్రమాణాలతో సొంతగా తయారు చేస్తున్నారు.

సొంతంగా, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగలను తయారు చేయడంతో ఈవీ ఖర్చు దాదాపు 50% తగ్గిందని రాజా గాయం పేర్కొన్నారు. వాస్తవానికి, స్వాపబుల్ బ్యాటరీల మొదట ప్రతిపాదించిన వారిలో వీరు ఉన్నారు. 2015లో వారి మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ సిద్ధమైనప్పుడు ఆ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లడానికి గయామ్ సోదరులు హర్ష బవిరిసెట్టిని సహ వ్యవస్థాపకుడిగా బోర్డులోకి తీసుకొని వచ్చారు. పూర్తిగా సొంత టెక్నాలజీతో తయారు చేసిన ఎలక్ట్రిక్‌ ఆటోను 2015లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అదే ఏడాది బిగ్ బాస్కెట్ నుంచి 1,500 ఈవీలకు మొదటి పెద్ద ఆర్డర్ వచ్చింది. దీంతో ఆ కంపెనీ దశ తిరిగిపోయింది. ఆ తర్వాత కంపెనీకి ఆర్డర్ల వర్షం కురిసింది.
 

అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఐకియా, ఉబెర్, ఢిల్లీవెరీ వంటి ఈ-కామర్స్ సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వచ్చాయి. ప్యాసింజర్‌, కార్గో రెండురకాల ఆటోలు తయారు చేసి పలు కంపెనీలకు అందజేశారు. అలాగే ఇప్పుడు యుకె, యుఎస్, యూరప్, జపాన్, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాలలో ఈ కంపెనీకి చెందిన వాహనాలు రోడ్డు మీద నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్ పెరగడంతో సహవ్యవస్థాపకులు గత ఏడాది తమ కంపెనీని బిలిటి ఎలక్ట్రిక్ పేరుతో అమెరికాలో తమ బ్రాంచ్ అక్కడ ఓపెన్ చేశారు.

(చదవండి: అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన న్యూ ఏజ్ బాలెనో కారు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top