
బెంగళూరుకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిషా ఇటీవల ఓ ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఓ ప్రొడక్ట్‌ను ఆర్డర్ చేశారు. అందులో సమస్యల కారణంగా ఆమె కంపెనీ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలని ప్రయత్నించారు. సంస్థ కస్టమర్ సపోర్ట్ కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఏర్పాటు చేసినా తన సమస్య పరిష్కారం కాలేదు. నేరుగా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడాలంటే కంపెనీ ప్రిమియం తీసుకోవాలని సూచిస్తూ.. డబ్బు చెల్లిస్తేనే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌కు కాల్ కనెక్ట్ అవుతుందనేలా పాప్‌అప్ వచ్చింది.
ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా క్విక్ కామర్స్ కంపెనీలు తమ కస్టమర్ సపోర్ట్ కోసం చాట్‌బాట్‌లను వినియోగిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పటివరకు కాల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఒకవేళ వినియోగదారుడు నేరుగా ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలనుకుంటే మాత్రం అదో లగ్జరీ సర్వీస్‌లాగా మారుస్తున్నాయి. దాంతో కొన్ని కంపెనీలు రియల్‌టైమ్‌లో ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలంటే రిజర్వ్ చేసిన టైర్డ్ మెంబర్‌షిప్‌లను తీసుకోవాలని సూచిస్తున్నాయి.
కంపెనీలు ఈ అంతర్లీన సాంకేతిక మార్పు ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. దాంతో ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని నమ్ముతున్నాయి. ఏఐ చాట్‌బాట్‌లు వస్తువుల రిటర్న్‌లు, డెలివరీ సమస్యలు, లాగిన్ పరిష్కారాలు.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. కానీ, కస్టమర్లకు భావోద్వేగ భరోసా ఇచ్చేందుకు మాత్రం ఎగ్జిక్యూటివ్‌లు కావాల్సిందేనని కొందరు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: నేపాల్‌లో ఉద్యమానికి ‘డిస్‌కార్డ్’ సహకరించిందా?