హిందుస్తాన్‌ యూనిలీవర్‌ సరికొత్త రికార్డ్‌లు!

HUL achieves Rs 50,000 crore turnover, first pure FMCG firm - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ సరికొత్త రికార్డు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో తొలిసారి రూ. 50,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. తద్వారా ఈ మైలురాయి అందుకున్న తొలి ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా నిలిచింది. ఇక గతేడాది చివరి త్రైమాసికంలో నికర లాభం 5 శాతంపైగా పుంజుకుంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 2,307 కోట్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,190 కోట్ల లాభం నమోదైంది. కాగా.. కంపెనీకి చెందిన 16 బ్రాండ్లు ఒక్కొక్కటీ రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తున్నట్లు హెచ్‌యూఎల్‌ సీఎఫ్‌వో రితేష్‌ తివారీ పేర్కొన్నారు. ఇక డవ్, విమ్, రిన్‌ బ్రాండ్లయితే విడిగా రూ. 2,000 కోట్ల చొప్పున ఆదాయాన్ని సాధిస్తున్నట్లు వెల్లడించారు. 

10 శాతం ప్లస్‌ 
ప్రస్తుత క్యూ4లో మొత్తం ఆదాయం 10 శాతంపైగా ఎగసి రూ. 13,468 కోట్లను తాకింది. నిర్వహణలాభ(ఇబిటా) మార్జిన్లు 0.2 శాతం నీరసించి 24.6 శాతానికి చేరాయి. గరిష్ట ద్రవ్యోల్బణంలోనూ పటిష్ట మార్జిన్లు సాధించినట్లు తివారీ పేర్కొన్నారు. వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 10,782 కోట్లకు చేరాయి. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ఇంతక్రితం 2021 నవంబర్‌లో రూ. 15 చెల్లించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 8,892 కోట్లను తాకింది. 2020–21లో రూ. 7,999 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని రూ. 51,472 కోట్లకు చేరింది.  

విభాగాల వారీగా 
క్యూ4లో హెచ్‌యూఎల్‌ హోమ్‌ కేర్‌ విభాగం ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 4,743 కోట్లకు చేరగా.. సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాలు 4 శాతం పెరిగి రూ. 4,743 కోట్లను తాకాయి. ఫుడ్, రిఫ్రెష్‌మెంట్‌ టర్నోవర్‌ 5 శాతం బలపడి రూ. 3,698 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్‌ షేరు  బీఎస్‌ఈలో నామమాత్ర నష్టంతో రూ. 2,144 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top