ఎయిరిండియాకు అపార అవకాశాలు

Huge opportunities for Air India says ceo Campbell Wilson - Sakshi

సీఈవో క్యాంప్‌బెల్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు అపార అవకాశాలున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తాజాగా పేర్కొన్నారు. వెరసి ఎయిరిండియా గ్రూప్‌ను అంతర్జాతీయ దిగ్గజంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో విస్తారాను కంపెనీతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు విలేకరుల వర్చువల్‌ సమావేశంలో వెల్లడించారు.

ప్రస్తుతం కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఇదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్‌ కనెక్ట్‌(ఎయిరేషియా ఇండియా)లను సైతం కంపెనీలో విలీనం చేసే కార్యాచరణకు ఇప్పటికే తెరతీసినట్లు తెలియజేశారు. ఎయిరిండియా గతంలో ఎన్నడూచూడని భారీ వృద్ధిని అందుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు.

ఈ నెల 14న ఎయిరిండియా 70 వైడ్‌బాడీ మోడల్‌సహా 470 విమానాల కొనుగోలుకి ఆర్డర్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు విల్సన్‌ తెలియజేశారు. వీటిలో ఎయిర్‌బస్‌ నుంచి 250, బోయింగ్‌ నుంచి 220 విమానాలను పొందనుంది. ఎయిరిండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్‌ సొంతం చేసుకున్న విషయం విదితమే. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top