Hyderabad: హైదరాబాద్‌లో రియల్టీ జోష్‌! 

Housing Sales in Top Seven Cities Surge March Qtr: Anarock - Sakshi

అమ్మకాల్లో 64 శాతం, ప్రారంభాల్లో 273 శాతం వృద్ధి

ఏడు ప్రధాన నగరాల్లో విక్రయాల వృద్ధి 29 శాతమే

అనరాక్‌ 2021 క్యూ1 నివేదిక వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం మళ్లీ జోరందుకుంది. ముంబై, బెంగళూరు, పుణే వంటి దేశంలోని ఏ ఇతర నగరంలోనూ కనిపించిన వృద్ధి.. భాగ్యనగరి రియల్టీలో నమోదైంది. 2021 జనవరి–మార్చి (క్యూ1)లో హైదరాబాద్‌లో 4,400 గృహాలు విక్రయమయ్యాయి. 2020 క్యూ1లో ఇవి 2,680 యూనిట్లుగా ఉన్నాయి. అంటే వార్షికంగా 64 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అలాగే 2021 క్యూ1లో కొత్తగా 12,620 ఇళ్లు ప్రారంభం కాగా.. క్రితం ఏడాది క్యూ1లో ఇవి 3,380 యూనిట్లుగా ఉన్నాయి. వార్షికంగా 273 శాతం వృద్ధిని నమోదైనట్లు అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ 2021 క్యూ1 నివేదిక వెల్లడించింది. 

హైదరాబాద్, ఎన్‌సీఆర్, ఎంఎంఆర్, బెంగళూరు, పుణే, చెన్నై, కోల్‌కత్తా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 క్యూ1లో 58,290 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2020 క్యూ1లో ఇవి 45,200 యూనిట్లతో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2020 క్యూ1లో 41,220 యూనిట్లు ప్రారంభం కాగా.. 2021 క్యూ1లో 51 శాతం వృద్ధి రేటుతో 62,130 యూనిట్లకు పెరిగాయి. మొత్తం ప్రారంభాల్లో రూ.40–80 లక్షల మధ్య ధర ఉన్న మధ్య స్థాయి గృహాల వాటా 43 శాతం, అఫర్డబుల్‌ హౌసింగ్‌ వాటా 30 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా గతేడాది క్యూ1లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6.44 లక్షలు ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 6.42 లక్షలకు తగ్గాయి. ఎన్‌సీఆర్, బెంగళూరు రెండు నగరాల్లో మాత్రమే ఏడాది కాలంలో ధరలు 2 శాతం మేర పెరిగాయి. 

స్టాంప్‌ డ్యూటీ తగ్గింపే వృద్ధికి కారణం.. 
ముంబై, పుణే వంటి నగరాల్లో గృహాల విక్రయాలకు ప్రధాన కారణం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్‌ డ్యూటీని తగ్గించడమే. ఇతర నగరాల్లో వృద్ధికి గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు, డెవలపర్ల ఆఫర్లు, అందుబాటు ధరలు ప్రధాన కారణాలని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనూజ్‌ పురీ తెలిపారు. నగరాల వారీగా చూస్తే.. ఎన్‌సీఆర్‌లో 2020 క్యూ1లో 8,150 యూనిట్లు అమ్ముడుపోగా.. 2021 క్యూ1లో 8 శాతం వృద్ధితో 8,790 గృహాలకు పెరిగాయి. ఎంఎంఆర్‌లో 13,910 నుంచి 46 శాతం వృద్ధితో 20,350 యూనిట్లకు, బెంగళూరులో 8,630 నుంచి 8,670కి, పుణేలో 7,200 నుంచి 47 శాతం వృద్ధితో 10,550కి, చెన్నైలో 2,190 నుంచి 30 శాతం పెరుగుదలతో 2,850కి, కోల్‌కత్తాలో 2,440 యూనిట్ల నుంచి 10 శాతం వృద్ధితో 2,680 గృహాలకు చేరాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top