హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఇలా.. | Home Sales Surge in Hyderabad and Top Indian Cities | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఇలా..

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 12:48 PM

Home Sales Surge in Hyderabad and Top Indian Cities

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జనవరి–మార్చి త్రైమాసికంలో జోరుగా సాగాయి. మొత్తం 1,01,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో అమ్మకాలు 93,280 యూనిట్లతో పోల్చితే 9 శాతం అధిక అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాల విలువ రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల విలువ రూ.1.42 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 6 శాతం వృద్ధి చెందింది.

కానీ, 2025 డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే అమ్మకాల పరిమాణం (యూనిట్లు) 7 శాతం, అమ్మకాల విలువ 6 శాతం చొప్పున తగ్గినట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ తన నివేదికలో తెలిపింది. 2025 డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.1.60 లక్షల కోట్ల విలువైన 1,08,970 యూనిట్లు అమ్ముడైనట్టు వెల్లడించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల వివరాలు ఇందులో ఉన్నాయి.  

ఢిల్లీ మార్కెట్లో ప్రతికూలతలు 
దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ హౌసింగ్‌ మార్కెట్‌లో మాత్రం ఇళ్ల అమ్మకాల జోరు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే మెరుగుపడగా, త్రైమాసికం వారీగా జోరు తగ్గింది. జనవరి–మార్చి క్వార్టర్‌లో 15,985 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 జనవరి–మార్చి త్రైమాసికం అమ్మకాలు 11,120 యూనిట్లతో పోల్చితే 44 శాతం పెరగ్గా.. డిసెంబర్‌ క్వార్టర్‌లో విక్రయాలు 19,250 యూనిట్లతో పోల్చితే 17 శాతం తగ్గినట్టు అనరాక్‌ నివేదిక తెలిపింది.

భారత నివాస మార్కెట్‌ మూలాలు దీర్ఘకాలానికి బలంగా ఉన్నట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా స్వల్పకాల ప్రతికూలతలు మార్చి త్రైమాసికంపై చూపించినట్టు చెప్పారు. భారత గృహ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మధ్యప్రాచ్య ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గి ఉండొచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement