ఈపీసీ రంగంలో టెక్‌ నిపుణులు

Hiring of tech talent increasing in EPC sector - Sakshi

పెరుగుతున్న ఉద్యోగాలపై నివేదిక

ఐటీయేతర రంగాలలో అగ్రస్థానం

ముంబై: నిర్మాణ రంగంలోని ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విభాగంలో టెక్‌ నిపుణుల నియామకాలు ఊపందుకున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఈ రంగంలోని సంస్థలు నిలకడగా టెక్నాలజీ ప్రమాణాల పెంపు(అప్‌గ్రెడేషన్‌)ను చేపడుతుండటం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ నివేదిక తెలియజేసింది.

‘దేశ ఈపీసీ రంగంలో నేటి ఉపాధి ధోరణి(ట్రెండ్‌)–2023 ఫిబ్రవరి’ పేరిట రూపొందించిన నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. 2023 బడ్జెట్‌ నేపథ్యంలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఈపీసీ రంగంలో టెక్‌ నిపుణులకు డిమాండును పెంచినట్లు పేర్కొంది. అటు అత్యుత్తమ స్థాయి యాజమాన్యం, ఇటు కొత్తవారికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు తెలియజేసింది.  

టెక్నాలజీయేతరాల్లో..
నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌(2,367 ఉద్యోగాలు) తదుపరి టెక్నాలజీయేతర రంగాలలో ఈపీసీ 11 శాతం వాటాతో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోంది. ఆపై బ్యాంకింగ్‌ 10 శాతం, ఎఫ్‌ఎంసీజీ రంగం 3 శాతం, ఫార్మా 2 శాతం చొప్పున నిలుస్తున్నాయి. ఈ నివేదికను సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ 80,000 మందికి ఉపాధి కల్పించిన 52 ఈపీసీ కంపెనీలపై చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించింది. 2023 జాబ్‌ పోర్టళ్లలో నమోదు చేసిన 21,865 ఉద్యోగాలనూ విశ్లేషణకు పరిగణించింది.

ఈపీసీ కంపెనీలు సాంకేతికతలను నిరంతరంగా అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ఫుల్‌ స్టాక్‌ డెవలపర్లు, జావా డెవలపర్లు, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్టులు, ఇంటెగ్రేషన్‌ నిపుణులను నియమించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ నిపుణుల ఎంపికలో బెంగళూరు( 19 శాతం), ఢిల్లీ–ఎన్‌సీఆర్‌(18 శాతం) టాప్‌ ర్యాంకులో నిలిచాయి. కార్యకలాపాల డిజిటైజేషన్, సామర్థ్యం, కస్టమర్‌ సేవల మెరుగు తదితరాల కోసం ఈపీసీ కంపెనీలు ఐటీ నిపుణులను ఎంచుకుంటున్నాయి. మౌలికాభివృద్ధిపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి కారణంగా ఈ రంగం వేగవంతంగా విస్తరించనున్నట్లు సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్‌ మిశ్రా పేర్కొన్నారు. దీంతో గతంలోలేని విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నట్లు అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top