తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్‌ లేదు!

Hired but no job campus recruitment troubles for freshers - Sakshi

ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లకు తప్పని ‘క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌’తిప్పలు

ఏడాది కావస్తున్నా ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోని కొన్ని కంపెనీలు

పైగా మళ్లీ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు చేస్తుండటంతో ఆందోళన

ఐటీరంగంలో ఒడిదుడుకులు సహజమేనంటున్న నిపుణులు

మరీ ఎక్కువకాలం వేచి ఉండాల్సి రావడం సమస్యేనని వెల్లడి

యువత నైపుణ్యాలు, నాలెడ్జ్‌ను పెంచుకోవాలని సూచన

‘రిక్రూట్‌’సమయంలోనే ఉద్యోగాల్లోకి తీసుకునే తేదీపై హామీ తీసుకోవాలి: రమణ భూపతి

ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటే అన్నీ సర్దుకుంటాయి: ‘కో ఫోర్జ్‌’ వెంకారెడ్డి

గత ఏడాదే కోర్సులు పూర్తి చేసుకున్న ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో ఎంపికైనా ఉద్యోగాలు మాత్రం ఇంకా చేతికి అందలేదు. ఏడాది కింద కాలేజీలకే వెళ్లి, మెరిట్‌ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి రిక్రూట్‌ చేసుకున్న కొన్ని కంపెనీలు ఇప్పటికీ ‘ఆన్‌ బోర్డింగ్‌ (ఉద్యోగాల్లో చేర్చుకోవడం)’ప్రక్రియను మొదలుపెట్టలే దు. పైగా మళ్లీ కొత్తవారి కోసమంటూ పలు కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు చేపడుతుండటం.. చిన్న కంపెనీలే కాకుండా బహుళజాతి కంపెనీ (ఎంఎన్‌సీ)లు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఉద్యోగం వస్తుందా, రాదా? భవిష్యత్తు ఎలా ఉంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్‌/డిగ్రీ చదువు ముగియగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ఎంపిక కావడంతో.. తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే ఊహలు తలకిందులు అవుతున్నాయని వాపోతున్నారు.    
– సాక్షి, హైదరాబాద్‌

నిరుద్యోగుల వెతలెన్నో..

ఇటీవల ‘ఫోరం ఫర్‌ ఐటీ ఎంప్లాయీస్‌ (ఫైట్‌)’చేసిన అధ్యయనంలో ‘ఆఫర్‌ లెటర్ల’తో అభ్యర్థు లు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు చేస్తూ ఆఫర్‌ లెటర్లు (లెటర్‌ ఇంటెంట్‌) ఇచ్చిఏడాది దాటుతున్నా ఆన్‌ బోర్డింగ్‌ సమాచారం ఇవ్వడం లేదు. దీనితో చాలా మంది ఆందోళనలో పడిపోతున్నారు. ఇక కొన్ని కంపెనీలు ఆఫర్‌ లెటర్లను రద్దు చేస్తున్నా యి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరేందుకు నిర్ణీతకాలానికి బాండ్లు సమర్పించాలని, ఒరిజి నల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని కొర్రీలు పెడుతు న్నా యి. అభ్యర్థులు ఇతర కంపెనీల్లో మంచి ఉద్యో గాలు, ఆఫర్లు వచ్చినా వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తాము శిక్షణ, ఇతరాల కోసం వెచ్చించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తే ఇతర కంపెనీలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాయి. ఫైట్‌ నిర్వహించిన సర్వేలో వేయి మందికి పైగా ఆఫర్‌ లెటర్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇన్ఫోసిస్, ఎంఫసిస్, విప్రో, క్యాప్‌జెమిని వంటి ప్రధాన కంపెనీలు కూడా ఇందులో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 

ఆందోళన వద్దు.. 
ఐటీరంగంలో ఒడిదుడుకులు సహజమేనని, యువత తమ నైపుణ్యాలు, నాలెడ్జ్‌ను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం కొన్నినెలల నిరీక్షణ ఫరవాలేదని, అది ఎక్కువ కాలమైతేనే సమస్యగా మారుతుందని చెప్తున్నారు. రెండు, మూడేళ్లకోసారి కరెక్షన్‌ వస్తుందని, అది ఆయా రంగాలకు మంచిదే తప్ప హానికరం కాదని పేర్కొంటున్నారు. 

ముందే స్పష్టత తీసుకోవాలి.. 
ఎంఎన్‌సీలు సహా వివిధ ఐటీ కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వచ్చినప్పుడే ఏ తేదీ లోగా ‘ఆన్‌ బోర్డింగ్‌’చేస్తారనే దానిపై కాలేజీ యాజమాన్యాలు స్పష్టత తీసుకోవాలి. లేకుంటే కంపెనీలు తమకు నచ్చినట్టు చేస్తూ.. అవసరముంటే నెలలోనే జాయినింగ్‌ ఇస్తూ, లేకుంటే నెలల తరబడి జాప్యం చేస్తూ వెళుతున్నాయి. ఈ విషయంలో అటు కాలేజీలు, ఇటు కంపెనీల తప్పిదాలు ఉన్నాయి. ఐటీ కంపెనీ లు వెంటనే ఉద్యోగం ఇవ్వకపోయినా శిక్షణ ఇవ్వొ చ్చు. ఇంటర్న్‌షిప్, ట్రైనింగ్‌ ప్రాసెస్‌తో నడిపించవచ్చు. ఫ్రెషర్స్‌ కూడా ఒక కంపెనీ ఆఫర్‌కే పరిమి తం కాకుండా మరో కంపెనీలో ప్రయత్నించొచ్చు. ఆన్‌బోర్డింగ్‌ వచ్చేలోగా చిన్న కంపెనీలు, స్టార్టప్‌లలో చేరి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. 
– రమణ భూపతి, క్వాలిటీ థాట్‌ గ్రూప్‌ చైర్మన్‌ 

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా జాయినింగ్‌ తేదీపై కంపెనీలు స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించాలి. ఆఫర్‌ లెటర్లను గౌరవించని సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వపరంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇటీవల మా సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లకు అందజేశాం..     
– సి.వినోద్‌కుమార్, కన్వీనర్, ఫోరం ఫర్‌ ఐటీ ఎంప్లాయీస్‌

ఆర్థిక మాంద్యం తొలగితే చక్కబడొచ్చు 
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితి నెలకొంది. మార్కెట్‌ వాస్తవ పరిస్థితి ఏమిటనేది మరో మూడు నెలల్లో స్పష్టత వస్తుంది. కంపెనీలు మంచి ఉద్ధేశంతోనే ఫ్రెష్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాయి. కంపెనీ బిజినెస్‌ అవసరాలను బట్టి ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన వారిని ఆన్‌బోర్డింగ్‌కు పిలుస్తుంటాయి. ఆఫర్‌ లెటర్లు ఇచ్చి పిలవనంత మాత్రాన అది నేరమేమీ కాదు. ఎకానమీ వృద్ధి చెంది పరిశ్రమకు సానుకూల పరిస్థితులు ఏర్పడితే అన్నీ సర్దుకుంటాయి. గత వందేళ్లలో ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగి ఎక్కువ ప్రచారం జరగడం తప్ప ఇది కొత్తగా వచ్చిన సమస్యేమీ కాదు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్కిల్స్‌ పెంచుకోవాలి. 
– కోఫోర్జ్‌ వెంకా రెడ్డి, సీనియర్‌ హెచ్‌ఆర్‌ లీడర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top