
కరోనా తర్వాత నుంచి హోమ్ ఆటోమేషన్‌పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇల్లు ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు భాగమైపోయింది. రెండు దశాబ్దాలుగా స్మార్ట్ హోమ్స్ సేవలనేవి విలాసవంతమైన వసతుల నుంచి దైనందిన అవసరంగా మారిపోయాయి. భద్రత, ఆదా, సౌకర్యం.. హోమ్ ఆటోమేషన్ లాభాలివే. దీంతో నివసించే నగరమే కాదు ఇళ్లు కూడా హైటెక్‌గా ఉండాలని యువతరం కోరుకుంటోంది. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా స్మార్ట్ హోమ్స్‌ను నిర్మిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఇంటిలోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, ఫ్రిజ్, గీజర్, టీవీ వంటి ప్రతి ఎల్రక్టానిక్ ఉపకరణాన్ని సెల్‌ఫోన్‌తోనే నిర్వహణ చేసే వీలుండటమే స్మార్ట్ హోమ్స్ ప్రత్యేకత. ఇంటి ముందు గేటు నుంచి మొదలుపెడితే తలుపులు, కిటికీ కర్టెన్లు, లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, గ్యాస్, హోమ్ థియేటర్, గార్డెన్ ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతతో వినియోగించడమే హోమ్ ఆటోమేషన్. అలెక్సా, గూగుల్ హోమ్, సిరి ఈ మూడు వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీతో మనం ఎంపిక చేసిన సమయం ప్రోగ్రామింగ్ ప్రకారం ఆయా వస్తువులు పని చేస్తుంటాయి.
ఎలా పనిచేస్తాయంటే..
విప్రో, ఫిలిప్స్, హావెల్స్, ఎంఐ, క్రిస్టాన్, స్నైడర్, ల్యూట్రాన్, లెగ్‌గ్రాండ్, పెర్ట్ హోమ్, ఫైబరో వంటి కంపెనీలకు చెందిన వైర్‌లెస్, వైర్డ్ అనే రెండు రకాల హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వైఫై, బ్లూటూత్, జెడ్ వేవ్, జిగ్‌బీ నాలుగు రకాల వైర్‌లెస్ ప్రొటోకాల్స్‌తో ఆటోమేషన్ ఉత్పత్తులు అనుసంధానమై ఉంటాయి. ఆయా ఉత్పత్తులకు చెందిన మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, ఇంట్లోని ఎన్ని ఫోన్లకైనా అనుసంధానిచవచ్చు. కస్టమర్లు ఇష్టాన్ని బట్టి కేవలం తన వాయిస్‌ను మాత్రమే గుర్తించేలా ఉపకరణాలను అనుసంధానివచ్చు. లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి వాయిస్‌నైనా గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.

లాభాలెన్నో..
హోమ్ ఆటోమేషన్‌తో విద్యుత్ వృథా ఉండదు. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్మార్ట్ హోమ్స్‌లో 20–30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు భద్రత మెరుగవుతుంది. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. 1,500 చ.అ. అపార్ట్‌మెంట్‌లో వీడియో డోర్ బెల్, ఒక లైట్, ఫ్యాన్, ఏసీ, గీజర్‌తో కూడిన బేసిక్ హోమ్ ఆటోమేషన్‌కు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిషన్, ఇంజనీర్, నెట్‌వర్క్, సాంకేతిక నిపుణులు నలుగురు వ్యక్తులు 3–4 రోజుల్లో పూర్తిగా హోమ్ ఆటోమేషన్ పూర్తి చేస్తారు.