న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో బిలియన్ డాలర్లుగా (యూనికార్న్) ఎదిగే దేశీ స్టార్టప్‌లకు అధునాతన తయారీ, డీప్ టెక్నాలజీ దన్నుగా నిలుస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఈ దశను ఆయన యూనికార్న్ 2.0గా అభివర్ణించారు.
అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా సొంత టెక్నాలజీలను సమకూర్చుకోవడం, దీర్ఘకాలం నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. యాక్సిలార్ వెంచర్స్ చైర్మన్, సీఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్స్ చైర్మన్ కూడా అయిన గోపాలకృష్ణన్ సీఐఐ యూనికార్న్ సదస్సు 2026లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు.
‘డీప్‌టెక్ చాలా కష్టమైన వ్యవహారం. చాలా సమయం పట్టేస్తుంది. పెట్టుబడుల పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. విఫలమయ్యే అవకాశాలు ఎక్కువే. కానీ నిలబడగలగితే ప్రయోజనాలు అత్యధికంగా ఉంటాయి‘ అని క్రిస్ తెలిపారు. ఈ పరివర్తనకు ఊతమిచ్చేలా పరిశోధనలు, అభివృద్ధి, ఆవిష్కరణలకు (ఆర్‌డీఐ) సంబంధించిన ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశ, విదేశాల నుంచి కూడా వచ్చే పెట్టుబడులతో ఈ వ్యవస్థ 30–40 బిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుందని, రేపటి డీప్‌టెక్ యూనికార్న్‌లకు బాటలు వేస్తుందని వివరించారు.


