breaking news
Kris Gopalakrishnan
-
వెలిగే స్టార్టప్‌లు తక్కువే..
♦ 70 శాతం విఫల బాట... నిలదొక్కకునేవి 20 శాతమే ♦ 5-10 శాతమే బడా కంపెనీలుగా మారుతున్నాయి ♦ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం 5 నుంచి 10 శాతం స్టార్టప్‌లే (ప్రారంభ కంపెనీలు) విజయం సాధించి పెద్ద కంపెనీలుగా నిలబడగలవని రుజువవుతున్నట్లు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు. 70% కంపెనీలు మూతపడేవేనన్నారు. ఓ 20 శాతం స్టార్టప్‌లు నిలదొక్కుకున్నా వృద్ధి చెందలేక చిన్న కంపెనీలుగానే మిగిలిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కాకపోతే ఇది సహజంగా జరిగే ప్రక్రియే. దీన్నొక సవాలుగా చూడొద్దు’’ అన్నారాయన. 12వ ఆవిష్కరణ సదస్సులో స్టార్టప్‌ల విజయం, వాటి భవిష్యత్తుపై గోపాలకృష్ణన్ తన అభిప్రాయాలను ఆవిష్కరించారు. మరో గూగుల్ భారత్ నుంచేనా..? ‘నిలదొక్కుకోవడం, విఫలం కావడం అన్నవి సహజ పరిణామాలు. అయితే, వీటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ప్రపంచ స్థాయి కంపెనీలుగా అవతరించాయి. బడా కంపెనీలకు నిదర్శనంగా నిలిచాయి. పేటీఎం, ఫ్రెష్‌డెస్క్ వంటి ఎన్నో కంపెనీలు ఇదే బాటలో ఉన్నాయి. ఇప్పటి నుంచి మరో ఐదేళ్లలో ఈ కంపెనీల గురించి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుకోవాల్సి వస్తుంది’ అని గోపాలకృష్ణన్ వివరించారు. ఈ-రిటెయిల్ కంపెనీల్లో స్థిరీకరణ జరుగుతోందని, ఎలాంటి సరిహద్దులు లేని ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్లో భారత కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయని చెప్పారాయన. గూగుల్ వంటి మరో కంపెనీ భారత్ నుంచి రావడం సాధ్యమా? అన్న ప్రశ్నకు... ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ వంటి కంపెనీ ఒక్కటే ఉందని గుర్తు చేశారు. రవాణా, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ రంగాలకు భవిష్యత్తులో దృష్టి పెట్టాల్సినవిగా పేర్కొన్నారు. ప్రైవేటు, ఈక్విటీ వెంచర్ కేపిటల్ నిధులు తగ్గిపోవడానికి, నిష్ర్కమణ మార్గాలు లేకపోవడమే కారణంగా చెప్పారు. చాలా వరకు వెంచర్ ఫండ్స్ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు తగిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. విలీనాలు, కొనుగోళ్ల ద్వారా అవకాశం వచ్చినా తగిన విలువ లభించడం లేదంటూ వ్యవస్థలోని లోపాలను వ్యక్తీకరించారు. -
‘క్రిస్’కు ఇన్ఫోసిస్ వీడ్కోలు
బెంగళూరు: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో వ్యవస్థాపకుల శకం పూర్తిగా ముగిసింది. తాజాగా క్రిస్ గోపాలకృష్ణన్ పదవీ విరమణ చేశారు. దీంతో మొత్తం వ్యవస్థాపకులందరూ కంపెనీ నుంచి వైదొలిగినట్లయింది. బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో క్రిస్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఇప్పుడంతా కంప్యూటర్లమయంగా మారింది. ఇది భారీ పరిశ్రమగా రూపొందింది. డెబ్భై సంవత్సరాల ఈ రంగంలో దాదాపు 35 ఏళ్ల పాటు భాగమవడం నా అదృష్టం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ ఏర్పాటు, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పరిశ్రమపై తమదైన ముద్ర వేయగలిగామని క్రిస్ పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ.. పరిశోధన, ఎంట్రప్రెన్యూర్షిప్పై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. నీలేకని తదితర మాజీ సహచరుల తరహాలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. ఈ ఏడాది జూన్ 14న ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వైదొలిగిన క్రిస్.. ఆ తర్వాత నుంచి కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మిగతా వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎన్ఎస్ రాఘవన్, ఎస్డీ శిబులాల్, కె. దినేష్‌లు కూడా ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మూర్తి సహా వ్యవస్థాపక బృందం 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. నభూతో నభవిష్యత్.. ఎంతో నిబద్ధతతో, ఎన్నో త్యాగాలకోర్చి ఏకంగా 33 ఏళ్ల పాటు ఒక సంస్థను తీర్చిదిద్దిన వ్యవస్థాపక సభ్యుల బృందాన్ని దేశం గతంలో ఎన్నడూ చూడలేదని, ఇకపై కూడా చూడకపోవచ్చని ఈ సందర్భంగా నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ‘బోంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1993లో ఈ సంస్థ లిస్టయినప్పుడు మార్కెట్ విలువ రూ. 28.5 కోట్లు. అక్కణనుంచి 2014లో రూ. 2,00,000 కోట్లకు పెరిగింది. అంటే 21 సంవత్సరాల్లో 6,50,000 శాతం మేర రాబడులు ఇచ్చినట్లు లెక్క. కంపెనీని ఇంత ఘనమైన స్థాయికి తీసుకొచ్చిన సంతృప్తితో వైదొలుగుతున్నాం’ అని ఆయన చెప్పారు. ఈ నెల 10 దాకా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్న మూర్తి.. అటు తర్వాత నుంచి గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు, కస్టమర్ల అవసరాలను గుర్తెరిగి, వారితో సత్సంబంధాలు కొనసాగించడం ఏ వ్యాపారానికైనా కీలకమని, అదే తాను ఆచరణలో పెట్టానని నీలేకని పేర్కొన్నారు. -
టెక్నాలజీ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తా..
బెంగళూరు: ఈ అక్టోబర్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత టెక్నాలజీ స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్. వ్యక్తిగత స్థాయిలో ఏంజెల్ ఇన్వెస్టరుగా ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే 10వ ఇండియా ఇన్నోవేషన్ సమ్మిట్ ఏర్పాట్లను వివరించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘నాకు తెలిసిందల్లా టెక్నాలజీనే. అందులో డిజిటల్, మార్కెటింగ్, ఈ-రిటైలింగ్ లాంటి వాటికి డిమాండ్ బాగా ఉంది. కాబట్టి వాటిలో లేదా అలాంటి ఇతర విభాగాలపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది’ అని గోపాలకృష్ణన్ చెప్పారు. ఉత్పత్తుల విభాగంలోనూ అవకాశాలు ఉన్నాయని.. అయితే భవిష్యత్‌లో సేవలు, ఉత్పత్తుల మధ్య హద్దులు చెరిగిపోగలవని ఆయన తెలిపారు. చాలా మటుకు ఉత్పత్తులు రాబోయే కాలంలో సర్వీసుల రూపం సంతరించుకోవచ్చన్నారు. కాబట్టి ఐటీలో కొత్త ఆవిష్కరణలపైనే తాను దృష్టి పెట్టదల్చుకున్నానని గోపాలకృష్ణన్ వివరించారు. దేశీయంగానే పెట్టుబడులు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు తన ఫ్యామిలీ ఆఫీస్ కింద ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలా లేక వ్యక్తిగతంగానే ఇన్వెస్ట్ చేయాలా అన్న అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో కన్నా దేశీయంగానే ఏదైనా చేయడంపైనే తనకు ఎక్కువ ఆసక్తి అని గోపాలకృష్ణన్ తెలిపారు. రిటైరైన తర్వాత ఇన్ఫీకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఎప్పట్లాగే తప్పకుండా అందిస్తానని చెప్పారు. ఇన్ఫోసిస్ రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో కొత్త సీఈవో విశాల్ సిక్కా గెడైన్స్ కోసం వ్యవస్థాపకులను సంప్రదించడంలో తప్పేమీ లేదని, అయితే ఇది ఈ ఒక్కసారికే పరిమితం అవుతుందని గోపాలకృష్ణన్ తెలిపారు. సిక్కా సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన సారథ్యంలో కంపెనీ గణనీయంగా వృద్ధి చెందగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడైన గోపాలకృష్ణన్ అక్టోబర్ 10 దాకా నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. రిటైర్మెంట్పై క్రిస్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్‌ను ఏర్పాటు చేయబోయే టీమ్‌లో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇది నాకెంతో ఇష్టమైన ప్రాజెక్టు. బెంగళూరు, కేరళలో నవకల్పనలు, స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్షిప్ వంటి వాటిలో పాలుపంచుకుంటున్నాను. నవకల్పనలపై సీఐఐ ఏర్పాటుచేసిన జాతీయ కమిటీకి సారథ్యం వహిస్తున్నాను. వీటి ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. చివరిగా సామాజిక కార్యక్రమాలపైనా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటికే మా కుటుంబ ట్రస్టు ద్వారా విద్యార్థులకు ఉపకారవేతనాల రూపంలో సాయం చేస్తున్నాం’. -
వ్యాపార నైపుణ్యాలు నేర్పించాలి!!
గెస్ట్ కాలమ్ సేనాపతి గోపాలకృష్ణన్.. అంటే గుర్తుపట్టడం కొంత కష్టమే. క్రిస్ గోపాలకృష్ణన్.. అంటే అందరికీ సుపరిచితమైన పేరు. ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన సాఫ్ట్వేర్ సంస్థ ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1979లో పట్ని కంప్యూటర్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించి.. 1981లో ఇన్ఫోసిస్ స్థాపనలో చేయి కలిపిన గోపాలకృష్ణన్.. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ స్థాయికి ఎదిగారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ బెంగళూరు చైర్మన్‌గా, ఐఐఎం-బెంగళూరు గవర్నింగ్ బోర్డ్ సభ్యుడిగా విద్యారంగ అభివృద్ధిలోనూ తనవంతు తోడ్పాటును అందిస్తున్నారు. విద్యార్థులు తమను తాము ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దుకోవాలి, కాలేజీ స్థాయిలోనే విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తే కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది అంటున్న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ గోపాలకృష్ణన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ... దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం? నాణ్యమైన విద్య అనేది మన దేశ విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశం. చక్కటి విద్యను అందించి తద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను సంసిద్ధులను చేయాలంటే.. నిపుణులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు అవసరం. అదేవిధంగా నిరంతరం పరిశోధనలు కొనసాగించేందుకు వీలుగా సరిపడ నిధులు అందుబాటులో ఉండేలా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుంచే సంస్కరణలు తేవాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది మౌలిక సదుపాయాల కల్పన. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆడియో-విజువల్ సౌకర్యాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ఆధునిక వనరులను వినియోగించి నాణ్యమైన విద్యను అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కేవలం కుర్చీలు, బల్లలు ఉన్న సాధారణ తరగతి గదులే ఉంటున్నాయి. ఈ పరిస్థితికి వీలైనంత త్వరగా స్వస్తి పలికి, బోధనలో ఆధునికతవైపు అడుగులు వేయాలి. అదే విధంగా విద్యార్థినుల నమోదు శాతం పెరిగేలా స్కూళ్లలో వారి కోసం టాయిలెట్లు వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. మన దేశంలో ఉన్నత విద్య, ఉద్యోగాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. ప్రాథమిక స్థాయిలో వారికి ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే. మన విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాల్సిన అవసరముంది? విద్యార్థులకు రెగ్యులర్ కరిక్యులంను బోధిస్తూనే.. ఇంటర్నెట్ ఆధారిత అధునాతన శిక్షణ అందించాలి. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఎడ్యుకేషనల్ టూల్స్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలు మరింతగా మెరుగుపరచుకునేలా వారిని ప్రోత్సహించాలి. తద్వారా విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాలతోపాటు విస్తృతమైన పరిజ్ఞానం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా వేల మంది విద్యార్థులు కళాశాల విద్యకు, ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారు తమ స్వశక్తిపై జీవించేలా, సదరు రంగంలో ఉపాధి పొందేలా పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య నైపుణ్యాలు అందించాలి. విద్యార్థులకు జాబ్ మార్కెట్ సంబంధిత నైపుణ్యాలు అందించేందుకు ఒకేషనల్ ఎడ్యుకేషన్‌కు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కంపెనీలు అభ్యర్థుల్లో ఎలాంటి లక్షణాలను కోరుకుంటున్నాయి? పరిశ్రమ వర్గాలు ప్రధానంగా విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, సమస్య సాధన నైపుణ్యాలు (ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్) ఉండాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే.. పరిశ్రమలలో టెక్నాలజీ పరంగా మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. నేర్చుకునే తత్వం లేకుంటే వెనకబడిపోవడం ఖాయం. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కలిగిన వ్యక్తులు సమస్యల్లోనే అవకాశాలను గుర్తిస్తారు. ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొంటారు. వీటితోపాటు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, బృందంలో కలిసి పనిచేయగలిగే నేర్పు, నిర్వహణా నైపుణ్యాలు ఉండాలని కంపెనీలు కోరుతున్నాయి. పరిశ్రమ అవసరాలకు, అకడెమిక్ నైపుణ్యాలకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా కంపెనీలకు, కాలేజీలకు మధ్య పరస్పర సంబంధాలు కొనసాగించాలి. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రీ విజిట్స్ వంటి మార్గాల ద్వారా ఈ సమస్యకు సులువుగా పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ తనవంతు కృషి చేస్తోంది. విద్యార్థుల్లో ఇండస్ట్రీకి తగిన నైపుణ్యాలు అందించేందుకు ప్రస్తుతం ఇన్ఫోసిస్.. క్యాంపస్ కనెక్ట్, క్యాచ్ దెమ్ యంగ్ (సీటీవై); స్పార్క్ (్కఅఖఓ) అనే మూడు ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తోంది. క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్‌ను తొలుత 2004లో 60 కళాశాలలతో ప్రారంభించాం. ఇండస్ట్రీ-అకడెమిక్స్ మధ్య దూరం తగ్గించడం క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు ఐటీ పరిశ్రమ అవసరాలకు సరితూగేలా నిపుణులను తయారు చేయడంపై ఈ క్యాంపస్ కనెక్ట్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందుకోసం క్యాంపస్ కనెక్ట్ పోర్టల్‌లో ఇన్ఫోసిస్ కోర్స్వేర్ను, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. అదే విధంగా పలు సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించి పరిశ్రమ అవసరాలు విద్యార్థులకు తెలిసేలా చేస్తున్నాం. అలాగే రెండు వారాల వ్యవధి ఉండే సీటీవై ప్రోగ్రామ్ ద్వారా పాఠశాల విద్యార్థులకు ఐటీపై అవగాహన కల్పిస్తాం. విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తాం. ఎంట్రెన్స్‌లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ఇన్ఫోసిస్ సంస్థలో అనుభవజ్ఞులతో కలిసి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నాం. దీనివల్ల విద్యార్థులకు చిన్నతనం నుంచే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అలవడుతుంది. 2008లో ప్రారంభించిన ్కఅఖఓ ప్రోగ్రామ్ ప్రధానంగా ఐటీ రంగంలో ఆధునిక మార్పులు, ఐటీ రంగ పురోభివృద్ధిలో ఇన్ఫోసిస్ పాత్ర అనే అంశాలపై ఉంటుంది. ఇన్ఫోసిస్‌లోని వేల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని.. ఐటీ రంగానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా ఆలోచించడంపై మీ అభిప్రాయం? దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితుల కోణంలో ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు, స్టార్ట్-అప్స్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. విద్యార్థులు దీన్ని గుర్తించి వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాల ద్వారా సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు చూపించాలి. దానివల్ల సమాజంలో కొత్త వ్యాపారాలు, నూతన ఉత్పత్తులు, కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా అవసరం. దీనివల్ల వ్యక్తి అభివృద్ధితోపాటు, సమాజ అవసరాలు తీరుతాయి. ఫలితంగా ఆర్థిక ప్రగతికి మార్గం ఏర్పడుతుంది. ఇంతటి ప్రాముఖ్యమున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను అకడెమిక్ స్థాయిలోనే పెంపొందించాలంటే? ఎంటర్ప్రెన్యూరియల్ నైపుణ్యాలపై కాలేజీ స్థాయిలోనే శిక్షణ ఇవ్వడం అవసరం. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్స్, ఈ-సెల్స్ వంటివి ఏర్పాటు చేయాలి. విద్యార్థులు వాటిలో పాల్పంచుకునేలా ప్రోత్సహించాలి. డిగ్రీ అంటే క్యాంపస్ సెలక్షన్స్- అయిదంకెల జీతం అనే చట్రం నుంచి విద్యార్థులను బయటకు తీసుకురావాలి. వారిని స్వయం ఉపాధి దిశగా ఆలోచించేలా చేయాలి. ఆ నైపుణ్యాలున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ సదుపాయాలు కల్పించాలి. తద్వారా భవిష్యత్తులో ఎన్నో స్టార్ట్-అప్స్‌ను, మరెందరో ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను సమాజానికి అందించడానికి వీలవుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అవసరం? ప్రభుత్వం చొరవ తీసుకొని విధాన నిర్ణయాల ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను, స్టార్ట్అప్లను ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఆర్థిక తోడ్పాటునందించేలా ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలి. దేశంలో ఎంటర్ప్రెన్యూరియల్ ఎకోసిస్టమ్‌కు దోహదపడేలా రోడ్ మ్యాప్‌ను తయారు చేయాలి. ఇలా చేయడం ద్వారా దేశ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోతుంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఎంటర్ప్రెన్యూర్ ఔత్సాహికులకు మీ సలహా? ఏ దశలోనూ నిర్దిష్ట లక్ష్యం నుంచి దృష్టిని మళ్లించకూడదు. జీవితంలో సవాళ్లు ఎదురవడం సాధారణం. ప్రతి సవాల్‌ను ఒక పాఠంగా భావించాలి. సవాళ్లు-సమస్యలు లేని విజయాలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గ్రహిస్తే ఉద్యోగం, ఉపాధి ఏదైనా సరే.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయం!