రూ.2.5 లక్షల కోట్ల రుణ హామీ పథకం
రుణగ్రహీతలు చేతులెత్తేస్తే బ్యాంకులకు చెల్లింపులు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో దేశీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలు) కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవనుంది. రూ.2.5 లక్షల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (రుణ హామీ పథకం)ను తీసుకొచ్చే యోచనతో ఉంది. ఈ పథకం కింద రుణాలు తీసుకున్న సంస్థలు ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా యుద్ధ ప్రభావం కారణంగా చెల్లింపుల్లో విఫలమైతే 90 శాతం మేర (రూ.100 కోట్ల వరకు) ప్రభుత్వం రుణదాతలకు (బ్యాంక్‌లు) చెల్లిస్తుంది.
ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) ఈ మేరకు హామీని బ్యాంక్‌లకు ఇవ్వనుంది. కరోనా సమయంలోనూ ప్రభుత్వం ఇదే తరహా పథకాన్ని (అత్యవసర రుణ హామీ పథకం/ఈసీఎల్‌జీఎస్) ప్రకటించడం తెలిసిందే. నాడు ఈ పథకం ఎంతో విజయవంతమైందని, ఎన్నో సంస్థలు నిలదొక్కుకుని, తర్వాత చెల్లింపులు చేసేందుకు వీలు ఏర్పడినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసీఎల్‌జీఎస్‌ను నాడు అన్ని రంగాలకు అమలు చేశారు. నూరు శాతం హామీని ఈ పథకం కింద ప్రభుత్వం అందించింది. దీనికింద అప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు, అదనపు రుణ సదుపాయాలను బ్యాంక్‌లు ఆఫర్ చేశాయి.
రుణ రేట్లపై పరిమితులతోపాటు ముందస్తు చెల్లింపుల చార్జీలు, ప్రాసెసింగ్ చార్జీల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ ధరలు భగ్గుమనడం తెలిసిందే. ఈ ప్రభావం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడం తెలిసిందే. ఫార్మా, టెక్స్‌టైల్స్ తదితర రంగాల్లో వినియోగించే కీలక ముడిపదార్థాలైన పెట్రోకెమికల్స్‌పైనా దిగుమతి సుంకాలను మినహాయించడం గమనార్హం.


