రెండో రోజూ- లాభాల్లో పసిడి

Gold, Silver rises second consecutive day in MCX - Sakshi

ప్రస్తుతం రూ. 50,329 వద్ద ట్రేడవుతున్న బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 62,233 వద్ద కదులుతున్న వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,880 డాలర్లకు

24.47 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

న్యూయార్క్/ ముంబై: నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ వారాంతాన యూటర్న్‌ తీసుకున్న బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. సెకండ్‌వేవ్‌లో భాగంగా కోవిడ్‌-19 అమెరికాసహా యూరోపియన్‌ దేశాలను వణికిస్తుండటంతో పలు ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డవున్‌లవైపు చూస్తున్నాయి. దీంతో తాజాగా బంగారానికి డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఫైజర్, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లపై అంచనాలతో గత వారం తొలి నాలుగు రోజులపాటు పసిడి ధరలు క్షీణిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా ట్రేడర్లు పసిడిలో స్క్వేరప్‌ లావాదేవీలకు ఆసక్తి చూపుతున్నట్లు బులియన్‌ విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలొ స్వల్ప కాలానికి పసిడి, వెండి ధరలు కన్సాలిడేషన్‌ బాటలోనే కదలవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. 

రెండో రోజూ..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 117 బలపడి రూ. 50,329 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,336 వద్ద గరిష్ఠాన్ని తాకింది. రూ. 50,211 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ నామమాత్రంగా రూ. 75 పుంజుకుని రూ. 62,233 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,300 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,055 వరకూ వెనకడుగు వేసింది. 

సానుకూలంగా..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం బలపడగా వెండి స్వల్పంగా నీరసించింది. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) స్వల్ప లాభంతో 1,880 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లో 0.2 శాతం ఎగసి 1,875 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.1 శాతం బలహీనపడి ఔన్స్ 24.47 డాలర్ల వద్ద కదులుతోంది. 

బలపడ్డాయ్‌..
దేశీయంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ శుక్రవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 268 లాభపడి రూ. 50,260 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,435 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,857 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 750 ఎగసి రూ. 62,200 సమీపంలో స్థిరపడింది. తొలుత రూ. 62,750 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ వెనకడుగు వేసింది.

లాభాలతో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు సానుకూలంగా ముగిశాయి. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.6 శాతం బలపడి 1,872 డాలర్ల ఎగునవ నిలిచింది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 1,871 డాలర్లకు చేరింది. వెండి 1.4 శాతం జంప్ చేసి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద స్థిరపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top