
ఒకే రోజు రూ.1,200 పెరుగుదల
ఢిల్లీలో 10 గ్రాములకు రూ.98,600
రూ.2,000 ఎగసిన వెండి
న్యూఢిల్లీ: పసిడి ధరల్లో ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి బలమైన సానుకూలతల అండతో స్టాకిస్టులు కొనుగోళ్లకు దిగడంతో పసిడి మంగళవారం ఒక్క రోజే రూ.1,200 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.98,670కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.98,150 స్థాయిని తాకింది. వెండి సైతం కిలోకి రూ.2,000 లాభపడి రూ.1,04,800కు చేరుకుంది.
డాలర్ బలహీనత కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ ఏర్పడినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అమెరికా ఆర్థిక గణాంకాలపై అంచనాలతో ఈ వారం పసిడి పట్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండొచ్చని అంచనా వేశారు. మరోవైపు అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 3,362 డాలర్ల స్థాయికి పుంజుకుంది. ‘‘డాలర్ బలహీనపడడం, అమెరికా ద్రవ్యలోటు విస్తరణపై ఆందోళనలతో.. ట్రంప్ ప్రతిపాదిత పన్ను తగ్గింపుల బిల్లుపై మార్కెట్లు దృష్టిపెట్టాయి. దీంతో బంగారం ఆకర్షణీయంగా మారింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.