బంగారం మరింత దిగొస్తుందా?

Gold Prices Can Bounce Back In 2021 - Sakshi

1,750 డాలర్లు కిందకు వెళితే... ఇంకా పతనం!

పసిడిపై నిపుణుల అంచనా

న్యూఢిల్లీ/న్యూయార్క్‌: అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌ (నైమెక్స్‌)లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర ఫిబ్రవరి 5వ తేదీ శుక్రవారం 1,815 డాలర్ల వద్ద ముగిసింది. అంతక్రితం వారం (జనవరి 29) ముగింపుతో పోల్చితే దాదాపు 70 డాలర్లు పతనమైంది. వారం ట్రేడింగ్‌ ఒక దశలో 100 డాలర్ల మేర పతనమైంది. ఇప్పుడు బంగారం పయనంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.

మార్కెట్‌ నిపుణులు క్రిస్టోఫర్‌ లివీస్‌ అంచనాల ప్రకారం.. పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 1,750 డాలర్ల దిగువకు పడిపోతే మరింత పతనం వేగంగా జరిగే అవకాశం ఉంది. 50 వారాల ఈఎంఏ (ఎక్స్‌పొనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌) 1,786 డాలర్లకు గతవారం చివరిరోజు పసిడి తాకినప్పటికీ, ఆ స్థాయిలో మద్దతు తీసుకుని పైకి ఎగసింది. ఉపాధి అవకాశాలకు సంబంధించి అమెరికా గణాంకాలు పేలవంగా ఉండడం దీనికి కారణం. 1,750 డాలర్ల వద్ద తక్షణ మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని బంగారం నిలబెట్టుకోగలిగితే, 1,850 డాలర్ల స్థాయికి తిరిగి పసిడి ఎగసే అవకాశాలు ఉన్నాయి.  

వడ్డీరేట్లు, డాలర్‌ కీలకం 
అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్స్‌ రేటు (ప్రస్తుతం 0.25 శాతం), అమెరికా డాలర్‌ కదలికల (5వ తేదీ డాలర్‌ ఇండెక్స్‌ ముగింపు 90.96), కరోనా వ్యాక్సినేషన్‌ పక్రియ వేగవంతం, అమెరికా సహా ప్రపంచ ఎకానమీ రికవరీ ధోరణి వంటి కీలక అంశాలు అంతర్జాతీయంగా పసిడి ధరను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వడ్డీరేట్లు పెరిగితే అది పసిడికి ప్రతికూల వార్తగా మారే అవకాశం ఉంది. వడ్డీరేట్ల పెరుగుదల డాలర్‌ బలోపేతం కావడానికి దారితీస్తుంది. ఈ అంశం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,458 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,089 డాలర్లు. ఇక డాలర్‌ ఇండెక్స్‌ 52 వారాల కనిష్ట, గరిష్టాలు 89.16 – 104 శ్రేణిలో ఉంది. 

దేశీయంగా రూపాయి కీలకం 
దేశీయంగా పసిడి ధరలు డాలర్‌ మారకంలో రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది. రూపాయి బలహీనపడితే పసిడి బలోపేతం అయ్యే వీలుంది. అయితే తీవ్ర స్థాయిలో రూపాయి ప్రస్తుతం బలహీనపడే అవకాశం లేదన్నది విశ్లేషణ. 5వ తేదీతో ముగిసిన వారంలో రూపాయి విలువ 72.93 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి రూపాయికి పటిష్టతను ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).  

భారత్‌ రూపాయి పటిష్టానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్చి నాటికి మరో 20 బిలియన్‌ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉందని వాట్‌ స్ట్రీట్‌ బ్రోకరేజ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇటీవలి తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక విడుదల సందర్భంగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా ఎకనమిస్టులు ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, ఆస్తా గోద్వానీ చేసిన విశ్లేషణ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్‌– 2021 మార్చి)  జనవరి వరకూ ఆర్‌బీఐ తన ‘ఫారెక్స్‌ ఇంటర్‌వెన్షన్‌’ ద్వారా రూపాయి బలోపేతానికి 73.7 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. మార్చి నాటికి మరో 20 బిలియన్‌ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉంది. ‘అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగిపోతే మినహా’ దేశంలో పసిడి ధర తగ్గడానికే అధిక అవకాశాలు ఉన్నాయని అంచనా.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top