గిఫ్ట్‌లపై ఐటీ శాఖ నిఘా.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి! | Gift Tax Rules in India What You Need to Know | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌లపై ఐటీ శాఖ నిఘా.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!

May 11 2026 4:33 PM | Updated on May 11 2026 4:38 PM

Gift Tax Rules in India What You Need to Know

ఒకప్పుడు బహుమతులకంటూ ఓ ప్రత్యేక చట్టం ఉండేది. దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ, కొన్ని వేల కేసులు మిగిలాయి కోర్టుల్లో. పైగా ఈ బాధ్యతలను నిర్వహించేవారు సాక్షాత్తు ఇన్‌కంట్యాక్స్‌ అధికారులే. చాలా చాలా ఆచరణాత్మకంగా ఆలోచించి, ఈ చట్టంలోని అంశాలను చట్టం రద్దు చేసిన తర్వాత ఆదాయచట్టంలో అంతర్భాగంగా కలిపారు.

1961 చట్టంలోనే బహుమతులపై పన్ను భారానికి సంబంధించినవన్నీ ఇమిడిపోయాయి. వాటన్నింటినీ కొత్త చట్టం 2025లో యథాతథంగా పొందుపర్చారు.

కట్నాలనుకోండి, కానుకలు అనుకోండి, వర దక్షిణ .. సంప్రదాయం.. ఆనవాయితీ అనుకోండి. బహుమతులు ఇవ్వడం అనాదిగా వస్తున్న ఒక పరంపర. ఇక నుంచి గిఫ్ట్‌ అని అందాం. గిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి పన్నుభారం ఉండదు. అయితే, చాలా మంది ఈ అంశాన్ని ఆసరాగా తీసుకుని ఏదో ఒక దొంగ పేరుతో లేని మనిషిని సృష్టిస్తారు. అయితే, ఇలాంటి గిఫ్టుల విషయంలో మూడు విషయాలను మీరు రుజువులతో నిరూపించవలసి వస్తుంది.  

  • నిజంగా దాత ఉన్నాడా లేదా.

  • రెండోది వ్యవహారం జరిగిందా లేదా. అంతే. నాటకం..బూటకం కాదు కదా. బదిలీ కాగితాల పత్రాలు, దస్తావేజులు, రాతలు–కోతలు, బ్యాంకు అకౌంట్లలో పద్దులు అన్నీ ఉండాలి.

  • దాత స్తోమత, ఆదాయ ఆర్జన సామర్థ్యాలు, దానం ఇచ్చేందుకు ‘సోర్స్‌’ ఉండాలి.  

ఈ మూడు షరతులు సక్రమంగా ఉన్నట్లయితే, నిరూపిస్తే దాతను వదిలేస్తారు. ఇక బంతి స్వీకర్త చేతిలో పడుతుంది. స్వీకర్త వ్యక్తిగత ఆదాయపు లెక్కల్లో ‘గిఫ్ట్‌’ గురించి ఆరా తీస్తారు. షరతులకు లోబడి మినహాయింపులిస్తారు లేదా పన్ను భారం వేస్తారు. ఆదాయ వర్గీకరణలో ‘గిఫ్ట్‌’ని ఇతర ఆదాయం కింద భావిస్తారు.

గిఫ్ట్‌లో వివిధ రకాలు..

  • నగదు, చెక్కు, బ్యాంకు బదిలీ

  • కంపెనీలో వాటాలు, బాండ్లు, సెక్యూరిటీలు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, ఆభరణాలు, విలువైన పురాతన వస్తువులు, పెయింటింగ్స్‌ మొదలైనవి

  • ల్యాండ్, బిల్డింగ్, విల్లాలు, అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్లు, మల్గీలు.. ఇలా ఎన్నో స్థిరాస్తులు

ఎంత వరకు మినహాయింపు..
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటితే, అన్నింటికి కలిపి, పన్ను భారం ఏర్పడుతుంది. రూ. 50,000 లోపల గిఫ్ట్‌ల మీద ఎటువంటి పన్ను ఉండదు. లిమిట్‌ దాటితే మొత్తం బహుమతుల మీద పన్ను పడుతుంది. నగదు అయితే నగదు విలువ మీద ఇది ఉంటుంది.ఇక చరాస్తులైతే వాటి మార్కెట్‌ విలువ, అది కూడా ఫెయిర్‌ మార్కెట్‌ వేల్యూని పరిగణనలోకి తీసుకుంటారు. స్థిరాస్తులైతే రిజి్రస్టేషన్‌ సందర్భంలో స్టాంపు డ్యూటీ ఎంత మీద చెల్లించారో అంత విలువపైన లెక్కిస్తారు. ఇవన్నీ మీకు తెలిసినవే!

మినహాయింపులు వర్తించే గిఫ్టులు..

  • బంధువులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, అనువంశీకుల నుంచి వచ్చే గిఫ్టులు.

  • పెళ్లి సందర్భంలో ఎంత విలువైన గిఫ్టులైనా మినహాయింపు ఇస్తారు. ఒక జాబితా రాసుకోండి. నగదైనా ఫర్వాలేదు. పేరు, బంధుత్వం, విలువ రాయండి. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయండి. కాగితాలు, పత్రాలు భద్రపర్చండి.  

  • వీలునామా ద్వారా ఎలాంటి ఆదాయం, ఆస్తి వచ్చినా పన్నుండదు. అయితే, విల్లు ఉండాలి. అది అమల్లోకి రావాలి.

  • చనిపోయే ముందు సెంటిమెంటు, అటాచ్‌మెంటు, సంప్రదాయం కింద బహుమతులు ఇస్తే పన్ను భారం ఉండదు.

గతంలో ఎన్నో ఉదాహరణల ద్వారా మనం ఈ విషయాలు చెప్పాం. తగిన జాగ్రత్త వహించాలి. లాజిక్కులు, మేజిక్కులు వద్దు. అబద్ధాలొద్దు. వ్యవహారాన్ని చక్కగా వ్యక్తపరచి, సరైన పత్రాలతో సంజాయిషీ ఇస్తే, ఎలాంటి చిక్కులూ ఉండవు. వివరణ ఇవ్వకపోతే, మీ ఇన్‌కం కింద భావించి పన్ను వేస్తారు. బంధువుల మధ్య గిఫ్ట్‌ వ్యవహారం జరిగినా, కాగితాలు ఉండాలి. ఉదాసీనత వద్దు. మన ఆలోచన ప్రకారమే జరుగుతుందన్న భ్రమ వద్దు.

Advertisement
 
Advertisement
Advertisement