IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ

Furniture Store IKEA Planning To Open City Stores In India - Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద హోం ఫర్నీచర్‌ తయారీ, అమ్మకాల సంస్థ ఐకియా మరో కొత్త కాన్సెప్టుతో మార్కెట్‌లోకి రానుంది. అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ఎత్తులతో వస్తోంది. ఫర్నీచర్‌ సెగ్మెంట్‌లో ధరల యుద్ధానికి తెర లేపనుంది.

హైదరాబాద్‌తో మొదలు
స్వీడన్‌కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్‌ తయారీ సంస్థ ఐకియా తన తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నవీ ముంబైలో రెండో స్టోర్‌ను ఇటీవల ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇందులో తొమ్మిది వేల రకాల ఫర్నీచర్‌ వస్తువులు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ తరహా ఆల్‌ ఇన్‌ వన్‌ అనే సూత్రానే పాటిస్తూ వచ్చింది ఐకియా సంస్థ. కానీ ఇటీవల మార్కెటింగ్‌లో కొత్త సిటీ స్టోర్స్‌ పేరుతో కొత్త కాన్సెప్టును తీసుకొచ్చింది.

సిటీ స్టోర్లు
విశాలమైన ప్రాంగణంలో అన్ని వస్తువులు ఒకే చోట కష్టమర్లకు లభించాలనే మార్కెటింగ్‌ టెక్నిక్‌కి స్వల్ప మినహాయింపులు ఇచ్చింది. అన్ని రకాల వస్తువుల స్థానంలో ముఖ్యమైన వస్తువులు లభించే విధంగా ఐకియా ఫర్నీచర్‌ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని సిటీ స్టోర్ల పేరుతో ఏర్పాటు చేస్తోంది. పరిమాణంలో ఐకియా స్టోర్ల కంటే సిటీ స్టోర్లు చిన్నవిగా ఉంటాయి. యాభై వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిటీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 6,500 రకాల ఫర్నీచర్లు లభిస్తాయి.

ఎక్కడంటే
ఐకియా సిటీ స్టోర్లు ఇప్పటికే యూరప్లో ముఖ్యమైన నగరాల్లో ప్రారంభం అవగా ఇండియాలో హైదరాబాద్‌, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో ఈ సిటీ స్టోర్లు రానున్నాయి. ఈ మేరకు ఎకనామిక్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది.

ధరల తగ్గింపు
సిటీ స్టోర్ల ఏర్పాటుతో పాటు ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ కస్టమర్‌ బేస్‌ను సేల్స్‌ను సాధించాలనే లక్ష్యంతో ఐకియా ఉంది. ఈ మేరకు ఐకియా స్టోర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే 50 రకాల వస్తువుల ధరలను 20 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించినట్టు ఐకియా, ఇండియా మార్కెటింగ్‌ మేనేజర్‌ పెర్‌ హార్నెల్‌ తెలిపారు. ఐకియా స్టోర్ల నిర్వహాణ సామర్థ్యం పెంచడంతో పాటు మార్జిన్లను తగ్గించుకునైనా ధరల తగ్గింపును అమలు చేస్తామన్నారయన.
 

చదవండి: పికప్‌ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top