పెట్టుబడుల లక్ష్యాలపై దృష్టి పెట్టండి 

Fm Sitharaman Asks Ministries To Surpass Capex Target Set For Fy22 - Sakshi

ప్రభుత్వ శాఖల అధికారులకు ఆర్థిక మంత్రి సూచన 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న పెట్టుబడి వ్యయాల (కేపెక్స్‌) లక్ష్యాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ శాఖల వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి అనంతరం ఎకానమీకి పునరుజ్జీవం కల్పించాలంటే మరింతగా వ్యయం చేయడం కీలకమని ఆయన పేర్కొన్నారు.

బడ్జెట్‌లో ప్రకటించిన ప్రతిపాదనల అమలు పరిస్థితిని సమీక్షించేందుకు మంగళవారం వివిధ శాఖల సీనియర్‌ అధికారులతో సమావేశమైన సందర్భంగా ఆమె ఈ సూచనలు చేశారు. లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) బాకీల చెల్లింపు జూలై 31లోగా పూర్తయ్యేలా చూడాలని  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ), శాఖలకు మంత్రి సూచించారు. ఇక లాభసాటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని మరింతగా దృష్టి పెట్టాలని కూడా సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.   

పెట్టుబడులకు సంస్కరణల దన్ను: సీఈఏ కేవీ సుబ్రమణియన్‌ 
సరఫరాపరమైన అడ్డంకులను తొలగించడం సహా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా తీసుకున్న అనేక సంస్కరణలతో పెట్టుబడులకు మరింత ఊతం లభించగలదని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్‌ తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వర్ధమాన దేశాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 50 శాతం మేర పడిపోయినప్పటికీ.. భారత్‌లోకి మాత్రం రికార్డు స్థాయిలో రావడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా పెట్టుబడుల నివేదిక 2021 అంశంపై ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎస్‌ఐడీ) నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా సుబ్రమణియన్‌ ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన పెద్ద దేశం భారత్‌ మాత్రమేనని ఆయన చెప్పారు. ముఖ్యంగా సరఫరాపరమైన సమస్యలను తొలగించేందుకు ఉద్దేశించిన సంస్కరణలతో.. పెట్టుబడుల రాకకు మార్గం సుగమమైందని సుబ్రమణియన్‌ వివరించారు.

కార్మిక చట్టాలు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, లఘు పరిశ్రమల నిర్వచనం మార్చడం మొదలైనవి కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) నివేదిక ప్రకారం 2020లో భారత్‌లోకి 64 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఎఫ్‌డీఐలు అత్యధికంగా అందుకున్న దేశాల జాబితాలో భారత్‌ అయిదో స్థానంలో నిల్చింది. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) రంగంలోకి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి.    

చదవండి: చిన్న నగరాలకు రిటైల్‌ బ్రాండ్ల క్యూ...

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top