ఈ-కామర్స్‌కు కఠిన నిబంధనలు.. ఫ్లాష్‌ సేల్స్‌ నిషేధం!

 Flash Sales Ban Cci Changes To E-commerce Rules - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌లో ఫ్లాష్‌ సేల్స్‌తో ఈ–కామర్స్‌ కంపెనీల హడావిడి గుర్తుందిగా. భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకు ఫలానా ఉత్పత్తిని, ఫలానా సమయానికి అమ్ముతామంటూ చేసే ఆర్భాటాలకు కొద్ది రోజుల్లో అడ్డుకట్ట పడనుంది. ఒక వస్తువును ప్రదర్శించి మరో వస్తువును అంటగట్టినా, ఉత్పాదనను, సేవను అందించడంలో విక్రేత విఫలమైనా ఆ బాధ్యత ఈ–కామర్స్‌ కంపెనీదే. ఈ మేరకు వినియోగదారుల రక్షణ (ఈ– కామర్స్‌) నిబంధనలకు సవరణలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) సోమవారం సూచించింది. చదవండి :  ఐటీలో భవిష్యత్‌ అంతా వీటిదే

ప్రతిపాదిత సవరణలపై తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేసేందుకు ఈ–కామర్స్‌ కంపెనీలు, పారిశ్రామిక సంఘాలకు జూలై 6 వరకు ఎంసీఏ సమయం ఇచ్చింది. మార్కెట్‌ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కొందరు విక్రేతలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ తదితర ఈ–కామర్స్‌ కంపెనీలపై కాంపిటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణ జరుపుతున్న తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్‌లైన్‌ విక్రేతలను దెబ్బతీసేలా ఆఫర్‌ చేస్తున్న భారీ డిస్కౌంట్లపైనా సీసీఐ దర్యాప్తు చేస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఈ–కామర్స్‌ కంపెనీల్లో జవాబుదారీ పెరుగుతుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ–కామర్స్‌ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి. ప్రతిపాదిత సవరణల్లో ఏముందంటే..

అధికారుల నియామకం

కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ఈ–కామర్స్‌ కంపెనీలు తగు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. చీఫ్‌ కాంప్లియాన్స్‌ ఆఫీసర్‌ను నియమించాలి. భారతీయ పౌరుడైన ఈ–కామర్స్‌ ఉద్యోగిని రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా నియమించాలి. చట్టాన్ని అమలు చేసే సంస్థలు సంప్రదింపుల కోసం ఈ అధికారి అందుబాటులో ఉండాలి. ప్రతి ఈ–కామర్స్‌ సంస్థ వీలైనంత త్వరగా లేదా ఆర్డర్‌ అందిన 72 గంటల్లోగా సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలకు అందించాలి.

ప్రైవేట్‌ లేబుల్స్‌
ప్రైవేట్‌ లేబుల్స్‌ అమ్మకాలకు, ప్రమోషన్‌కు ఈ–కామర్స్‌ కంపెనీ తన బ్రాండ్‌ను వినియోగించరాదు.  

ఆధిపత్యానికి చెక్‌ 
ఏ విభాగంలోనైనా ఆధిపత్య స్థానం కలిగి ఉన్న ఈ–కామర్స్‌ సంస్థ దాని మార్కెట్‌ స్థానాన్ని దుర్వినియోగం చేయడానికి అనుమతించరు. ఒక నిర్దిష్ట విక్రేత లేదా సెల్లర్స్‌ సమూహాన్ని మాత్రమే విక్ర యించడానికి వీలు కల్పించే ఫ్లాష్‌ సేల్స్‌ నిషేధం. 

విదేశీ ఉత్పత్తులు
ఈ–కామర్స్‌ కంపెనీలు వినియోగదారుల కోసం ముందస్తు కొనుగోలు దశలో వాటి మూలం ఆధారంగా వస్తువులను గుర్తించి, వడపోత యంత్రాంగాన్ని అందించాలి. దేశీయ అమ్మకందారులకు న్యాయమైన అవకాశాన్ని కల్పించేందుకు ఆన్‌లైన్‌ కంపెనీలు దిగుమతి చేసుకునే వస్తువులకు ప్రత్యామ్నాయాలను చూపించాలి. 

ప్రాధాన్యతకు అడ్డుకట్ట
ఈ–కామర్స్‌ కంపెనీలకు చెందిన ఏ సంస్థ కూడా సెల్లర్‌గా నమోదు కారాదు. ఈ సంస్థలు అన్యాయమైన ప్రయోజనం కోసం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం నుంచి వినియోగదార్లకు చెందిన సమాచారం సేకరించరాదు. డెలివరీ సేవలు అందించే ఏ కంపెనీకి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వరాదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top