తొలి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌- పరీక్షలకు రెడీ | Sakshi
Sakshi News home page

తొలి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌- పరీక్షలకు రెడీ

Published Thu, Dec 10 2020 10:38 AM

first indigenous mNRA vaccine from Gennova bio - Sakshi

ముంబై, సాక్షి: కోవిడ్‌-19 కట్టడి కోసం దేశీయంగా తొలిసారి మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఆధారంగా వ్యాక్సిన్‌ అభివృద్ధికి బీజం పడింది. తొలి, రెండు దశల క్లినికల్‌ పరీక్షలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యూఎస్‌ సంస్థ హెచ్‌డీటీ బయోటెక్‌ కార్పొరేషన్‌ సహకరాంతో పుణే కంపెనీ జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్‌ ఇందుకు అనుమతిని పొందింది. జెన్నోవా అభివృద్ధి చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ప్రభావంతో ఎలుకలు, చింపాజీలు తదితర జంతువులలో కనిపించిన యాంటీబాడీలు, ఇమ్యునాలజీ తదితర అంశాల డేటా ఆధారంగా డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. (అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు)

షరతులతో..
హెచ్‌జీసీవో19 పేరుతో జెన్నోవా రూపొందించిన వ్యాక్సిన్‌కు మానవులపై క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ కొన్ని షరతులతో ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్‌ డేటా పరిశీలించిన సంబంధిత నిపుణుల కమిటీ(ఎస్‌ఈసీ) సలహామేరకు ఇందుకు అనుమతించింది. దీంతో కోవిడ్‌-19 కట్టడికి తొలిసారి ఎంఆర్ఎన్‌ఏ సాంకేతికతో దేశీయంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న కంపెనీగా జెన్నోవా నిలవనుంది. అయితే తొలి దశ క్లినికల్‌ పరీక్షల మధ్యంతర ఫలితాలను జెన్నోవా కమిటీకి దాఖలు చేయవలసి ఉంటుంది. వీటి ఆధారంగా రెండో దశ పరీక్షలకు అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. జెన్నోవా అభివృద్ధి చేస్తున్న కొత్తతరహా వ్యాక్సిన్‌కు మద్దతుగా బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ప్రాథమిక నిధులను(సీడ్‌ ఫండింగ్‌) అందించినట్లు తెలుస్తోంది. (జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!)

Advertisement
Advertisement