ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విటర్‌...ఇన్వెస్టర్లు హ్యాపీ.. ఉద్యోగులు వర్రీ | Experts Have Different Opinions on Elon Musk Twitter Takeover | Sakshi
Sakshi News home page

ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విటర్‌...ఇన్వెస్టర్లు హ్యాపీ.. ఉద్యోగులు వర్రీ

Apr 27 2022 1:01 AM | Updated on Apr 27 2022 1:05 AM

Experts Have Different Opinions on Elon Musk Twitter Takeover - Sakshi

న్యూయార్క్‌: మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 3.36 లక్షల కోట్లు) ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ టేకోవర్‌ చేయడంపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డీల్‌ వచ్చే 3–6 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. మస్క్‌ టేకోవర్‌ చేయడం ట్విటర్‌కు మంచే చేస్తుందని ఇన్వెస్టర్లు, కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ట్విటర్‌లో 9 శాతం వాటాలు తీసుకున్న విషయాన్ని ఎలాన్‌ మస్క్‌ ఈ నెల తొలినాళ్లలో ప్రకటించే నాటికి కంపెనీ షేరు 40 డాలర్ల లోపు ట్రేడవుతోంది. 2013లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చినప్పుడు పలికిన 26 డాలర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ.

2013 నుంచి చూస్తే టెక్నాలజీ సంస్థల షేర్లు ట్రేడయ్యే నాస్‌డాక్‌ కూడా మూడు రెట్లు పెరిగినా.. ట్విటర్‌ షేరు మాత్రం అక్కడక్కడే తిరుగుతోంది. పోటీ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్‌తో పోలిస్తే ట్విటర్‌ ఆదాయాలు, లాభాలు అంతంతమాత్రంగానే నమోదవుతుండటం ఇందుకు కారణం. అటు ట్విటర్‌ కన్నా మూడేళ్ల ముందు 2010లో లిస్టయిన ఎలాన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా షేరు ధర ఏకంగా 300 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో తన కంపెనీలను విజయవంతంగా నడిపిస్తున్న మస్క్‌ ఇచ్చిన టేకోవర్‌ ఆఫర్‌తో (షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు) ట్విటర్‌ ఒక్కసారిగా పుంజుకుంది. దాదాపు రెండు, మూడు వారాల వ్యవధిలోనే 50 డాలర్ల పైకి ఎగిసింది. దీంతో తమకూ సత్వరం లాభాలు తెచ్చిపెట్టగలిగే ఈ డీల్‌ విషయంలో ఇన్వెస్టర్లు సంతోషిస్తున్నారు. 

అనిశ్చితిలో సిబ్బంది.. 
అసాధారణ పద్ధతుల్లో పనిచేసే మస్క్‌ చేతుల్లోకి కంపెనీ వెడితే తమ పరిస్థితి ఏమిటని ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగ్రవాల్‌ సహా ట్విటర్‌ సిబ్బందిలో అనిశ్చితి నెలకొంది. ట్విటర్‌ను ప్రైవేట్‌ కంపెనీగా మార్చేస్తే ఉద్యోగాల్లో భారీగా కోతలు ఉంటాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘కంపెనీ ఎటువైపు వెడుతుందో నాక్కూడా తెలియదు. ప్రస్తుతానికైతే డీల్‌ పూర్తయ్యే వరకూ ఎప్పట్లాగే పని చేయడం కొనసాగిద్దాం’’ అంటూ టేకోవర్‌ నేపథ్యంలో ఉద్యోగులతో సంభాషించిన అగ్రవాల్‌ పేర్కొన్నారు. ఒప్పందం ముగిశాక ఉద్యోగులకు ఇచ్చిన స్టాక్‌ ఆప్షన్లను నగదుగా మార్చుకోవచ్చని, సిబ్బందికి ప్రస్తు తం ఇస్తున్న ప్యాకేజీలే ఏడాది పాటు కొనసాగవచ్చని ఆయన చెప్పారు. ట్విటర్‌లో పదేళ్ల క్రితం చేరిన అగ్రవాల్‌ గతేడాది నవంబర్‌లోనే సీఈవోగా నియమితులయ్యారు. ఆయనను తప్పిస్తే భారీ పరిహారం ఇవ్వాలి.

మస్క్‌ చేతిలో ట్విటర్‌ ఇలా.. 
క్లుప్తంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లక్ష్యం కోసమంటూ ఏర్పాటైన ట్విటర్‌ .. అడ్డగోలు నియంత్రణలతో దారి తప్పిందన్నది కంపెనీపై మస్క్‌ ప్రధాన ఆక్షేపణ. దాన్ని గాడిలో పెట్టేందుకే సొంతంగా కొనుక్కుని, ప్రైవేట్‌గా మారుద్దామనుకుంటున్నారు. అయితే, ట్విటర్‌ గతంలోనే భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చే విషయంలో అనేక ప్రయోగాలు చేసి, ఎదురుదెబ్బలు తిని, మనుగడ సాగించేందుకు ప్రకటనల ద్వారా ఆదాయాలు సమకూర్చుకునే క్రమంలో నియంత్రణలు అమలు చేస్తోంది. దీంతో వివాదాస్పద ట్వీట్లు వేసే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి ప్రముఖుల ట్విటర్‌ అకౌంట్లను కూడా రద్దు చేసేసింది. ఇక, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యం అంటూ ఊదరగొడుతున్న మస్క్‌ .. తన వరకూ వస్తే మాత్రం దానికి అస్సలు ప్రాధాన్యమివ్వరు.

ప్రస్తుతం ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడటం వల్ల ట్విటర్‌ .. కఠిన నియంత్రణలు అమలు చేయాల్సి వస్తోందన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. ఈ సమస్యను తప్పించేందుకు ప్రకటనల కన్నా యూజర్ల సబ్‌స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్నది మస్క్‌ ఆలోచనగా తెలుస్తోంది. అప్పుడు ప్రకటనకర్తల ఒత్తిడి ఉండదు కాబట్టి కంటెంట్‌ను నియంత్రించాల్సిన అవసరమూ తగ్గుతుందన్నది ఆయన అభిప్రాయం. దీంతో నిర్దిష్ట రుసుములు చెల్లించే యూజర్లు స్వేచ్ఛగా .. తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడానికి వీలుంటుందని మస్క్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ట్విటర్‌ను అడ్డం పెట్టుకుని మస్క్‌ తన ఇతర వ్యాపారాలను ప్రమోట్‌ చేసుకోవడం, ఏవియేషన్‌.. ఆటోమొబైల్‌ వంటి కీలకమైన రంగాలపై ప్రజాభిప్రాయాలను ఇష్టానుసారంగా ప్రభావితం చేయొచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి. 

కొనేద్దాం.. రేటెంత? 
ట్విటర్‌ టేకోవర్‌తో.. సోషల్‌ మీడియాలో హడావుడి నెలకొంది.         మస్క్‌ అలా షాపింగ్‌కని బైల్దేరి లైట్‌గా ఓ మూడు లక్షల కోట్ల రూపాయలతో ట్విటర్‌ను కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్లారంటూ కొందరు సరదాగా పోస్ట్‌ చేశారు. అటు సీఈవో పరాగ్‌ అగ్రవాల్‌ భవిష్యత్తుపైనా సెటైర్లు పడుతున్నాయి. హాయిగా టీసీఎస్‌లాంటి సంస్థలో చేరి ఉంటే ఉద్యోగానికీ, జీతానికి ఢోకా ఉండేది కాదంటూ మీమ్స్‌ వెల్లువెత్తాయి. ట్విటర్‌ను కొనాలన్న ఆలోచన మస్క్‌కు అయిదేళ్ల క్రితమే వచ్చిందంటూ 2017లో డేవ్‌ స్మిత్‌ అనే యూజర్‌తో ఆయన జరిపిన సంభాషణ స్క్రీన్‌ షాట్లు ప్రచారంలోకి వచ్చాయి. అప్పట్లో ట్విటర్‌ అంటే తనకు చాలా ఇష్టం అంటూ మస్క్‌ ఒక ట్వీట్‌ చేయగా.. అలాంటప్పుడు కొనుక్కోవచ్చుగా అని స్మిత్‌ సలహా ఇచ్చారు. దానికి ప్రతిగా (కొనేద్దాం) రేటెంత అంటూ మస్క్‌ ప్రశ్నించిన స్క్రీన్‌ షాట్‌  వైరల్‌గా మారింది.

మస్క్‌.. మస్త్‌... మస్త్‌
     ప్రపంచ కుబేరుడు మస్క్‌ ప్రస్తుత సంపద  దాదాపు 270 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  న్యూరాలింక్, స్పేస్‌ఎక్స్, ది బోరింగ్‌ కంపెనీ, టెస్లా (ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ)లకు ఆయన చీఫ్‌గా ఉన్నారు. వీటిలో కొన్నింటిని ఆయన స్వయంగా ఏర్పాటు చేయగా, కొన్నింటికి సహ వ్యవస్థాపకుడిగా లేదా ఇన్వెస్టరుగా చేరి తర్వాత పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం టెస్లా మార్కెట్‌ విలువ ఏకంగా 1 లక్ష కోట్ల డాలర్ల పైగా ఉంటుంది. ఇది ఆటోమొబైల్‌ దిగ్గజాలు ఫోర్డ్, జనరల్‌ మోటార్స్‌ సంయుక్త విలువ కన్నా అధికం కావడం గమనార్హం. 
     టెస్లా గతేడాది దాదాపు 10 లక్షల కార్లను విక్రయించింది. దాదాపు 54 బిలియన్‌ డాలర్ల ఆదాయంపై సుమారు 14 బిలియన్‌ డాలర్ల లాభం నమోదు చేసింది. 

ట్విటర్‌ కూత 
     2006లో జాక్‌ డోర్సీ తదితరులు దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 20 కోట్ల మందికి పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. అమెరికాలో అత్యధికంగా 7.7 కోట్లు, భారత్‌లో సుమారు 2.3 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.  ట్విటర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రస్తుతం దాదాపు 38.29 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కంపెనీ గతేడాది 5 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసింది.   

చదవండి:  ట్విటర్‌ డీల్‌.. చైనా ప్రస్తావనతో పొగిడాడా? చరుకలు అంటించాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement