ఏప్రిల్‌లో 5 శాతం తగ్గిన పెట్టుబడులు
2025 ఏప్రిల్ కంటే 58% అధికం
సిప్ పెట్టుబడుల్లోనూ స్వల్ప క్షీణత
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలతో ఈక్విటీల్లో అస్థిరతలు కొనసాగుతున్న తరుణంలోనూ రిటైల్ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల నమ్మకం బలంగానే కొనసాగుతుంది. ఏప్రిల్‌లో రూ.38,440 కోట్ల పెట్టుబడులు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి.
మార్చి నెలలో పెట్టుబడులు రూ.40,450 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం తగ్గగా.. 2025 ఏప్రిల్ నెల పెట్టుబడులు రూ.24,269 కోట్ల కంటే 58 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన పెట్టుబడులు రూ.25,978 కోట్లుగా ఉన్నాయి. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఏప్రిల్ నెల గణంకాలను విడుదల చేసింది.
→ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్( సిప్) ద్వారా ఈక్విటీ పథకాల్లోకి ఏప్రిల్‌లో రూ.31,115 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో వచ్చిన రూ.32,087 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి.
→ సిప్‌ల నిలిపివేత నిష్పత్తి మార్చిలో 101 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 97 శాతానికి తగ్గింది. సిప్ నిర్వహణ ఆస్తులు రూ.16.85 లక్షల కోట్లకు చేరాయి.
→ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏప్రిల్‌లో నికరంగా రూ.3.22 లక్షల కోట్లను వివిధ పథకాల్లోకి ఆకర్షించింది. మార్చిలో పరిశ్రమ నుంచి నికరంగా రూ.2.4 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్‌లోకి రూ.2.5 లక్షల కోట్లు రావడం ఏప్రిల్‌లో భారీ వృద్ధికి అనుకూలించింది.
→ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 11 శాతం పెరిగి రూ.81.92 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి విలువ రూ.73.73 లక్షల కోట్లుగా ఉంది.
మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ జోరు.. మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.6,551 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.6,885 కోట్ల చొప్పున ఆకర్షించాయి. మార్చితో పోల్చితే ఈ రెండు విభాగాల్లోకి 8–10 శాతం మేర అధిక పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.2,525 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
→ డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏప్రిల్‌లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. ఇందులో లిక్విడ్ ఫండ్స్‌లోకే రూ.1,65,205 కోట్లు వచ్చాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ.31,240 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.20,643 కోట్ల చొప్పున వచ్చాయి.
→ బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి పెట్టుబడులు మళ్లీ పుంజుకున్నాయి. మార్చి నెలలో రూ.2,266 కోట్ల పెట్టుబడులకు పరిమితం కాగా, ఏప్రిల్‌లో రూ.3,040 కోట్లకు పెరిగాయి.
→ సిల్వర్ ఈటీఎఫ్‌ల్లోకి కేవలం రూ.127 కోట్ల పెట్టుబడులే వచ్చాయి.
→ ఫోకస్డ్ ఫండ్స్ రూ.1,194 కోట్లను ఆకర్షించాయి.
→ ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.567 కోట్లను ఉపసంహరించుకున్నారు.
→ హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ, డెట్ కలిసిన)లోకి రూ.20,565 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో ఈ విభాగంలోకి రూ.16,538 కోట్లు రావడం గమనార్హం.
→ ఏప్రిల్‌లో 11 కొత్త పథకాలు మార్కెట్లోకి ప్రవేశించి ఇన్వెస్టర్ల నుంచి రూ.828 కోట్లను సమీకరించాయి.


