అసంఘటిత రంగంలో ఉపాధి జోరు! | employment opportunities growth in Unorganised Sector | Sakshi
Sakshi News home page

అసంఘటిత రంగంలో ఉపాధి జోరు!

May 22 2026 1:15 AM | Updated on May 22 2026 1:15 AM

employment opportunities growth in Unorganised Sector

9 కోట్లు దాటిన సంస్థలు 

15 కోట్లను మించిన ఉద్యోగాలు 

జాతీయ గణాంక కార్యాలయం విడుదల 

న్యూఢిల్లీ: వ్యవసాయేతర అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. 2026 జనవరి–మార్చి కాలంలో మొత్తం సంస్థల సంఖ్య 9.16 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 16.69 శాతం మేర సంస్థలు పెరిగినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన నివేదిక పేర్కొంది. క్రితం ఏడాది మార్చి నాటికి సంస్థల సంఖ్య 7.85 కోట్లుగానే ఉంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు (కార్మీకుల సంఖ్య) 15.17 కోట్లకు పెరిగాయి. వ్యవసాయేతర అసంఘటిత రంగంలో పరిస్థితులపై ఎన్‌ఎస్‌వో 2025 నుంచి ప్రతీ త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుండడం గమనార్హం.  

నివేదికలోని అంశాలు..  
→ ఈ రంగంలో మొత్తం ఉపాధి అవకాశాలు 15.51 శాతం వార్షిక వృద్ధితో 15.17 కోట్లకు చేరాయి. ముఖ్యంగా గ్రామీణ కార్మీక శక్తిలో 21.65 శాతం పెరుగుదల కనిపించగా, పట్టణాల్లో ఇది 10.39 శాతం మేర వృద్ధి చెందింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం చేదోడుగా ఉంటున్నట్టు ఈ నివేదిక పేర్కొంది.   

→ గ్రామీణ ప్రాంతాల్లో సంస్థల సంఖ్య 20.46 శాతం పెరగ్గా.. పట్టణాల్లో వృద్ధి 12.59 శాతంగా ఉంది.  

→ మొత్తం కార్మీకులలో వ్యాపారాలను సొంతంగానే నిర్వహించుకునే యజమానుల వాటా 58.29 శాతం నుంచి 60.97 శాతానికి మెరుగుపడింది. వేతనంపై పనిచేసే కార్మీకుల వాటా స్వల్పంగా 26.86 శాతం నుంచి 24.77 శాతానికి తగ్గింది.  

→ మహిళా కార్మీకుల వాటా 29 శాతానికి విస్తరించింది. గతేడాది కంటే స్వల్పంగా మెరుగుపడింది. సమ్మిళిత ఆర్థిక వృద్ధి, మహిళా సాధికారతకు ఈ రంగం తోడ్పడుతోంది. 

→ చాలా సంస్థలు తాత్కాలిక కార్మికులు, వలస కార్మికులు, హెల్పర్లపై ఈ రంగం ప్రధానంగా ఆధారపడుతోంది. ప్రధానంగా వ్యవసాయ పనుల్లేని సమయంలో కార్మీకులకు ఈ సంస్థలు ఉపాధినిస్తున్నాయి.  

→ గ్రామీణ సేవల్లోనూ అసంఘటిత సంస్థల వృద్ధి మెరుగ్గా ఉంది. ఈ సంస్థల సంఖ్య జనవరి–మార్చి త్రైమాసికంలో 24.82 శాతం పెరగ్గా, కార్మీకుల సంఖ్య 31.13 శాతం పెరిగింది. సొంత కాళ్లపై నిలబడే ఔత్సాహిక వ్యాపారవేత్తలు పెరుగుతున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.  

→ వ్యవసాయేతర అసంఘటిత సంస్థలు డిజిటల్‌ సాంకేతికతను సైతం అందిపుచ్చుకుంటున్నాయి. 81% సంస్థలు ఇంటర్నెట్‌ను వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తున్నాయి.  

→ సుమారు 81 శాతం వ్యాపార సంస్థలు నగదు రహిత డిజిటల్‌ చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. ఇందులో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, యూపీఐ, పీవోఎస్‌ తదితర సాధనాలున్నాయి.  

→ ఈ రంగంలోని దాదాపు 41.37 శాతం సంస్థలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. అసంఘటిత రంగం క్రమంగా వ్యవస్థీకృతంగా మారుతుండడాన్ని ఇది సూచిస్తోంది. 

→ మొత్తం 1,72,845 సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్‌ఎస్‌వో ఈ నివేదికను రూపొందించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement