అసంఘటితం నుంచి సంఘటిత రంగానికి

Employees Changing From Unorganised Sector To Organised Sector - Sakshi

కీలక రంగాల్లో కార్మికుల మళ్లింపు 

వేతన సమస్యలు, నైపుణ్యాల లోటు 

దీన్ని అధిగమించడంపై కంపెనీల దృష్టి 

ముంబై: కీలక పరిశ్రమలు కార్మికుల మళ్లింపుపై దృష్టి సారించాయి. ఎఫ్‌ఎంసీజీ, ఎఫ్‌ఎంసీడీ, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీలు తమ పరిధిలో పనిచేసే అసంఘటిత కార్మికులను సంఘటిత రంగంలోకి మళ్లిస్తున్నట్టు టీమ్‌లీజ్‌ నివేదిక తెలిపింది. ఈ రంగాల్లోని 59 శాతం కంపెనీలు ఇదే ఉద్దేశ్యంతో ఉన్నట్టు పేర్కొంది. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ)లో 37 శాతం కంపెనీలు, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ (ఎఫ్‌ఎంసీడీ)లో 36 శాతం, హెల్త్‌కేర్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో 27 శాతం కంపెనీలు ఇలా చెప్పాయి. ఈ రంగాల్లో కార్మికులను సంఘటిత రంగంలోకి తీసుకురావడంపై సెంటిమెంట్‌ ఎలా ఉందన్న దానిపై టీమ్‌ లీజ్‌ సర్వే చేసింది. 230 కంపెనీల అభిప్రాయాలను తెలుసుకుంది. ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికుల నిర్వహణను పెద్ద సవాలుగా కంపెనీలు పేర్కొన్నాయి.  

►అసంఘటిత కార్మికులకు సంబంధించి వేతనాలు తమకు పెద్ద సవాలు అని 45 శాతం కంపెనీలు తెలిపాయి.
►కార్మికుల నైపుణ్యాల పరంగా లోటును 21 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. 
► తరచూ విధులకు రాకపోవడం తాము ఎదుర్కొంటున్న సవాలు అని 15 శాతం కంపెనీలు తెలిపాయి. 
► ఈ సవాళ్లను అధగమించేందుకు కంపెనీలు అసంఘటిత రంగ కార్మికులను రెగ్యులర్‌ కార్మికులుగా తీసుకుని పనిచేయించుకునేందుకు మొగ్గు చూపిస్తున్నట్టు ఈ సర్వేలో తెలిసింది.  
► 90 శాతానికి పైగా పనివారు అసంఘటిత రంగంలోనే పనిచేస్తుండడం సంస్థలకు ప్రతిబంధకమని టీమ్‌లీజ్‌ పేర్కొంది. 

ఈ దిశగా అడుగులు..  
‘‘65 శాతానికి పైగా కంపెనీలు అసంఘటిత రంగ కార్మికుల నిర్వహణను సవాలుగా భావిస్తున్నాయి. దీంతో 56% కంపెనీలు అసంఘటిత రంగ కార్మికులను థర్డ్‌ పార్టీ రోల్స్‌లోకి తీసుకుని సంఘటిత కార్మికులుగా పనిచేయించుకోవాలని అనుకుంటున్నాయి. ఇప్పటికే 64% కంపెనీలు ఈ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టాయి. 67 శాతం కంపెనీలు ఏడాదిలోగా అమలు చేయాలనే ప్రణాళికతో ఉన్నాయి’’అని టీమ్‌లీజ్‌ నివేదిక తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top