
ఆర్థిక కార్యకలాపాలు మందగించడాన్ని ఎత్తి చూపుతూ 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్థికవేత్తలు సవరించారు. వాణిజ్యలోటు పెరగడం, వినియోగదారుల వ్యయం మందగించడం, శీతాకాల కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారడం ఇందుకు కారణమని చెబుతున్నారు. దిగుమతులు పెరగడం, ఎగుమతులు స్తంభించడంతో వాణిజ్యలోటు రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక్క జనవరి 2025లోనే వస్తు, సేవల లోటు 131.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ అసమతుల్యత విదేశీ వస్తువులకు పెరిగిన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. పాక్షికంగా సంభావ్య సుంకాల వల్ల వస్తువుల ఎగుమతులు సవాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వినియోగ వ్యయం కూడా బలహీనత సంకేతాలను సూచిస్తుంది. విచక్షణతో ఆలోచించి చేసే ఖర్చు(discretionary categories)పైనే దృష్టి పెడుతున్నారు. చాలా కుటుంబాలు అత్యవసరం కాని కొనుగోళ్ల కంటే అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు, నిర్దిష్ట జనాభాలో ఆర్థిక ఒత్తిడి వంటి అంశాలు ఈ వైఖరికి దోహదం చేస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఫోర్‌కాస్ట్ అంచనాల ప్రకారం ఈ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 1.4% వార్షిక వృద్ధి కనబరిచినప్పటికీ 2024 చివరి మూడు నెలల్లో వృద్ధి 2.3%తో పోలిస్తే చాలా మందగించింది.
ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్ల కోత..
ఆర్థిక అనిశ్చితి, తీవ్రమైన శీతాకాల వాతావరణం, అసాధారణంగా ఉండే ఫ్లూ సీజన్ వల్ల అనేక ప్రాంతాల్లో రిటైల్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. అమెరికా సుంకాలు సహా వాణిజ్య విధానాలు ఆర్థిక పరిస్థితులపై కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, వృద్ధి అనే ద్వంద్వ సవాళ్లను యూఎస్ సెంట్రల్ బ్యాంకు నిశితంగా పరిశీలిస్తూ ద్రవ్య విధాన నిర్ణయాలపై దృష్టి సారిస్తోంది. ఇటీవల ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించినప్పటికీ, ఈ ఏడాది చివర్లో వడ్డీరేట్ల కోత ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?
ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం..?
వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్న నేపథ్యంలో మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పెరగవచ్చని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు.